లారీ, బైకు ఢీ
● యువకుడి దుర్మరణం ● నష్టపరిహారం చెల్లించాలంటూ గ్రామస్తుల ఆందోళన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలియాపొడ ఘాటీ మలుపులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు శంకరడ పంచాయతీలోని ఎస్.డొంగశిలి గ్రామానికి చెందిన ప్రశాంత్ మాఝి (26) గా గుర్తించారు. ఉదయం తన గ్రామం నుంచి ప్రశాంత్ బైక్‌పై టికిరి పనిమీద వెళుతున్నాడు. కలియాపొడ ఘాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని అదుపుతప్పి బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో ప్రశాంత్ సంఘటనా స్థలం వద్దే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న టికిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని బాధితుడి కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో రెండు గంటలు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో పోలీసుల పాత్ర నిర్లక్ష్యంగా ఉందని భావించిన డొంగాశిలి గ్రామానికి చెందిన మహిళలు పోలీసులపై తిరగబడ్డారు. రహదారిపై నిరసన తెలుపుతూ ఆందోళనకారులు చెట్టు కొమ్మలను రోడ్డుకు అడ్డంగా వేసి రహదారిని దిగ్బంధించారు. బాధిత కుటుంబానికి నష్టం పరిహారం చెల్లించాలని వారంతా డిమాండ్ చేశారు. కొద్ది సమయం వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకోవడంతో రాయడ ఎస్‌డీపీవో గౌరహరి సాహు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను బుజ్జగించారు. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
లారీ, బైకు ఢీ


