రోడ్డెక్కిన రైతన్న
జాతీయ రహదారి దిగ్బంధించి నిరసన
మండీల మూసివేతపై మండిపాటు
భువనేశ్వర్ : మండీల మూసివేతను నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన ప్రదర్శించారు. వందలాది మంది వరి బస్తాల్ని జాతీయ రహదారిపై వేసి రాకపోకలను అడ్డుకున్నారు. బర్‌గడ్ జిల్లా గొడొభాగా వద్ద మంగళవారం జాతీయ రహదారి దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండీల మూసివేతకు సంబంధించి అధికారులతో చర్చలు విఫలమైన తర్వాత రైతులు రోడ్డును దిగ్బంధించారు. వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య ఘర్షణతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బర్‌గడ్ ఉప జిల్లా కలెక్టర్ ప్రసన్న కుమార్ పాండే, బర్‌గడ్ సబ్ డివిజినల్ పోలీసు అధికారి రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, అటాబిరా మండలం గొడొభాగా వరి సేకరణ మండి మూతపడింది. రైతాంగం వరి విక్రయానికి టోకెన్ల జారీ నిలిచిపోయింది. టోకెన్లు లభించినా మండీ తాళం పడడంతో పంట విక్రయానికి అవకాశం లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
రోడ్డెక్కిన రైతన్న
రోడ్డెక్కిన రైతన్న


