రాష్ట్రంలో దట్టమైన పొగమంచు
భువనేశ్వర్: రాష్ట్రంలో చలి వాతావరణం వణికిస్తోంది. దట్టమైన పొగ మంచు కమ్మిన వాతావరణంలో చలి గాలులు గజగజలాడిస్తున్నాయి. అనేక జిల్లాల్లో రాగల 2 రోజుల్లో దట్టమైన పొగమంచు, శీతల గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ వాతావరణ పరిస్థితులు దైనందిన జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ప్రయాణానికి అంతరాయం కలిగిస్తుంది.
పసుపు హెచ్చరిక
ఈ నెల 8న సుందర్‌గఢ్, కంధమల్, కొరాపుట్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ అయింది. ఆయా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. అంగుల్, ఝార్సుగుడ, ఖుర్ధా మరియు జగత్సింగ్‌పూర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రత ఉంటుందని సమాచారం. ఈ నెల 9 మంగళవారం కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయని వాతావరణ శాఖ సమాచారం. సుందర్‌గఢ్, కంధమల్, కొరాపుట్ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్మి ఉంటుంది. అంగుల్, ఝార్సుగుడ, ఖుర్ధా మరియు జగత్సింగ్‌పూర్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. ఈ ప్రాంతాల నివాసితులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారు జామున పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ పేర్కొంది. చలిగాలుల ప్రభావంతో గత 24 గంటల్లో పది చోట్ల ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం. గత 24 గంటల్లో జి.ఉదయగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సిమిలిగుడలో 7.5 డిగ్రీలు, దారింగ్‌బాడిలో 8 డిగ్రీలు, రౌర్కెలాలో 8.1 డిగ్రీలు, ఫుల్బాణిలో 8.5 డిగ్రీలు, ఝార్సుగుడలో 8.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. కటక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్‌కు దిగజారింది.


