సమాన అవకాశాలు
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ
దివ్యాంగుల సాధికారతకు..
భువనేశ్వర్: దివ్యాంగులకు సాధికారత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పునరుద్ఘాటించారు. రాష్ట్రం దివ్యాంగులందరికీ గౌరవాత్మకంగా సమాన అవకాశాలను నిర్ధారించడంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం–2025 సందర్భంగా సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారత (ఎస్‌ఎస్‌ఈపీడీ) శాఖ స్థానిక ఎస్‌ఓఏ ఆడిటోరియంలో నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమం ముగింపు ఉత్సవంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రతిభకు, సాధనకు వైకల్యం ఎప్పుడూ అడ్డంకి కాదన్నారు. కుటుంబం, సమాజం నుంచి సరైన మద్దతుతో అనేక మంది వికలాంగులు విభిన్న రంగాలలో రాణించారు. శారీరక పరిమితులు దృఢ సంకల్పాన్ని అడ్డుకోలేవని నిరూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా దివ్యాంగుల కోసం చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలు గణనీయంగా విస్తరించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 7 లక్షల మందిని మాత్రమే గుర్తించారు. గత 11 సంవత్సరాలలో దివ్యాంగుల గుర్తింపు పెరిగింది. దివ్యాంగుల గౌరవార్థం 2015లో దివ్యాంగ్ అనే పదాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఈపీడీ విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగ పౌరుల స్వావలంబన, సామాజిక, ఆర్థిక సాధికారత సాధించేలా చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో చాలా మంది దివ్యాంగ యువత అద్భుతమైన నైపుణ్యాలను కలిగి వివిధ రంగాల్లో తమ వంతు కృషి చేస్తున్నారు. పలు యాజమాన్యాలు, పారిశ్రామిక సంస్థలు వారి ప్రతిభని ఆదరించి వృద్ధి చెందడానికి మరిన్ని అవకాశాలను కల్పించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు సానుభూతిని ఆశించరు. సమాజంలో గౌరవంగా జీవించే హక్కును ఆశిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. ‘మీ కలలు మా అభివృద్ధికి మూలాలు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ పరిమితం చేసుకోకండి’ అనే నినాదంతో ప్రత్యక్షంగా ప్రోత్సహించాలన్నారు. ఇతరులు మీ కోసం నిర్దేశించిన సరిహద్దులను దృఢ చిత్తంతో సవాలు చేయండి అని ముఖ్యమంత్రి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించిన 33 మంది దివ్యాంగ క్రీడాకారులను ముఖ్యమంత్రి సత్కరించారు. వీరిలో టీ–20 దృష్టి లోపం ఉన్న మహిళల ప్రపంచ కప్ క్రికెట్ జట్టులోని నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఈపీడీ విభాగం మంత్రి నిత్యానంద గోండ్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవం దివ్యాంగుల అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిందని అన్నారు. స్పష్టమైన సంకల్పం విజయానికి మార్గం సుగమం చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించమని మంత్రి నిత్యానంద గోండ్ ప్రోత్సహించారు. అంత్యోదయ గృహ యోజన కింద పెరిగిన గృహాలు, స్కాలర్‌షిప్‌లు, భత్యాలు పెంపుదల, ప్రత్యేక విద్యావేత్తల నియామకాలు వంటి చొరవతో దివ్యాంగు బహుముఖ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విభాగం కమిషనర్, కార్యదర్శి ఆర్. ఎస్. గోపాలన్, ప్రత్యేక కార్యదర్శి రజని డాని, డైరెక్టర్ పరుల్ పట్వారీ పాల్గొన్నారు.
సమాన అవకాశాలు
సమాన అవకాశాలు
సమాన అవకాశాలు
సమాన అవకాశాలు


