పట్టణాభివృద్ధికి మాస్టర్ ప్లాన్
రాయగడ: పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాయగడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు జాగ్రఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) ఆధారంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సూచించారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో అమృత్–2.0 కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిశా పట్టణాభివృద్ధి సంస్థ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో రానున్న 2051 సంవత్సరం వరకు దృష్టిని పెట్టుకుని రాయగడ పట్టణాన్ని అభివృద్ధిపరచడంతో పాటు సమగ్ర భూ వినియోగం, మౌలిక సౌకర్యాల కల్పన వంటి ప్రణాళికతో కూడిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, డీఎఫ్‌వో అన్నా సాహెబ్ అహొలే, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న తదితరులు పాల్గొన్నారు.


