యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి
● అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కడ్రక
రాయగడ: రాయగడ వంటి ఆదివాసీ, హరిజన జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేకపొవడంతో నిరుద్యొగ యువత కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస బాట పడుతున్నారని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక బుధవారం జరిగిన శీతాకాల సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ప్రస్తావించారు. జిల్లాలో సుమారు 70 శాతం మంది ఆదివాసీ, హరిజనులు నివసిస్తున్నారన్నారు. ఉపాధి కోసం వెళ్తున్న ఎంతో మంది యువత అక్కడ అవస్థలు పడుతున్నారన్నారు. అక్కడకు వెళ్లిన ఎంతో మంది శవాలుగా ఇంటకి వస్తుండటం పరిపాటిగా మారిందన్నారు. జిల్లాలో ఉత్కళ అలూమిన, వేదంత, జేకేపేపర్ మిల్, ఇండియన్ మెటల్స్ అండ్ పెర్రొఎల్లొయిస్ (ఇంఫా), ఆదిత్య బిర్లా వంటి పరిశ్రమలు ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది చదువుకుని ఉద్యోగాలు లేకుండా వలస బాట పడుతున్న యువత ఉండటం విచారకరమన్నారు. వారి అర్హతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే వలసలు తగ్గుతాయన్నారు.


