58 కొత్త కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు
● మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్
భువనేశ్వర్: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదనలు దీర్ఘ కాలం వినియోగానికి వీలుగా నిల్వ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ డివిజన్ స్థాయిలో 58 శీతల గిడ్డంగులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బడ్జెటులో రూ. 252 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. తొందరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పాదనలు పదిల పరిచేందుకు శీతల నిల్వ గిడ్డంగుల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుంది. కోత తర్వాత వ్యవసాయ ఉత్పాదనల నష్టాలను నివారించడంలో ఈ చర్య దోహదపడుతుందన్నారు. బుధవారం శాసన సభ ప్రశ్నోత్తరాలు సందర్భంగా ప్రశ్నకు ప్రభుత్వ నిర్మాణ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 133 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఉండగా.. వాటిలో 35 మాత్రమే పూర్తిగా పనిచేస్తున్నాయన్నారు. వీటిలో 33 ప్రైవేట్‌గా, రెండు యూనిట్లు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, వాస్తవ అవసరాల మధ్య భారీ వ్యత్యాసాన్ని ఈ పరిస్థితి ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. గత దశాబ్దంలో 26 కొత్త శీతల గిడ్డంగులు నిర్మించారు. 22 పనిచేయడం ప్రారంభించగా 4 యూనిట్లు ప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన 133 యూనిట్లలో 98 పని చేయడం ప్రారంభించలేదు. వాటిలో 20 ప్రభుత్వ మరియు 78 ప్రైవేట్ గిడ్డంగులు ఉన్నాయి. కొత్త శీతల గిడ్డంగులు పూర్తయితే పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పాదనల వృథా నివారణతో రైతులు, వ్యాపారులు, వ్యవసాయ సరఫరా అనుబంధ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


