ఘనంగా ఘంటసాల జయంతి
పర్లాకిమిడి: గాన గాంధర్వుడు, చలనచిత్ర రంగంలో ఘనకీర్తి ఆర్జించిన ఘంటసాల వేంకటేశ్వరరావు 103వ జయంతిని చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి, పర్లాకిమిడిలో గురువారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు. కిమిడి పాతపట్నం రోడ్డులో ఉన్న ఘంటసాల విగ్రహానికి ఘంటసాల అభిమాని పారిశెల్లి రామరాజు పూల మాలలు వేసి జేజేలు పలికారు. ఈ కార్యక్రమాన్ని తొలుత చైతన్య ప్రార్థనం గీతంతో ప్రారంభించారు. చైతన్య సమితి కార్యదర్శి బర్నాల జనార్ధన రావు మాట్లాడుతూ, తెలుగు చలన చిత్ర రంగంలో అఖండ కీర్తి ఆర్జించి 40వేలకు పైగా పాటలు పాడి, సంగీతం సమకూర్చిన ఘంటసాల వేంకటేశ్వరరావుకు అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో ఇసై వెంకటరావు ఘంటసాల సుమధుల పాటలను పాడి శ్రోతలను అలరించారు. చైతన్య సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షులు కె.ఆనందరావు, పి.రామరాజు మాస్టారు, పి.వాసుదేవరాజు, యస్.ఎన్.పండా, కె.చిరంజీవులు, మల్లేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.


