పునరావాస కేంద్రాలకు 118 మంది గర్భిణులు
భువనేశ్వర్: మోంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తూర్పు కోస్తా రైల్వే (ఈకోర్) మరియు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) సీనియర్ అధికారులతో తుఫాన్ మోంథా సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తూర్పు తీరం వెంబడి ముంచుకొస్తున్న మోంథా తుఫాన్ దృష్ట్యా రైల్వే నెట్‌వర్క్ సన్నద్ధతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రయాణికుల భద్రత, రైలు రవాణా నియంత్రణ, సత్వర పునరుద్ధరణ కార్యకలాపాల ప్రణాళిక, స్థానిక రైల్వే యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం చర్యలను గమనించారు. తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, ప్రధాన విభాగాధిపతులు మరియు మండల రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎం) సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తుఫాను తాకిడి ప్రాంతాలు ప్రధానంగా వాల్తేరు మరియు ఖుర్దారోడ్ మండలాల్లో చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల గురించి మంత్రికి వివరించారు. ప్రయాణికుల భద్రత నిర్ధారణ, నిరంతరాయ కమ్యూనికేషన్ వ్యవస్థ పరిరక్షణ, విపత్తు ప్రతిస్పందన బృందాల నియామకం అంశాలపై మంత్రి దృష్టి సారించారు. తుఫాను తదనంతర రైలు సేవల సత్వర పునరుద్ధరణపై రైల్వే జోన్‌లు హై అలర్ట్‌లో ఉంటూ చురుకుగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
స్థానిక లోక్‌సేవా భవన్‌లో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మోంథా తుఫాను పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ), వాతావరణ శాస్త్రవేత్తలు, జలవనరుల శాఖ కార్యదర్శి, పోలీస్ మరియు అగ్నిమాపక శాఖ డీజీలు హాజరయ్యారు. మోంథా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం సమీపిస్తోంది. మోంథా మచిలీపట్నం, కాకినాడ తీరాలు గుండా గోపాల్‌పూర్ తీరానికి చేరువవుతుంది. తుఫాను తీరం తాకే ప్రక్రియ క్రమంగా పుంజుకుంటోంది.
తుఫాన్ ప్రభావంతో వర్షపాతం క్రమేపీ పెరుతుతోంది. గంజాం జిల్లా పత్రపూర్‌లో అత్యధికంగా 117 మిల్లీ మీటర్లు, గజపతి జిల్లా గొషాణిలో 115 మిల్లీ మీటర్లు, మోహనాలో 112 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జంట నగరాలు భువనేశ్వర్‌లో 18 మిల్లీ మీటర్లు, కటక్‌లో 12 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. రాష్ట్రం చేరుకునే సమయానికి తుఫాన్ బలహీనపడుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇది దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు వెళుతుంది. దీంతో మల్కన్‌గిరి, గంజాం, గజపతి, రాయగడ, కంధమల్, కలహండి మరియు నవరంగ్‌పూర్‌లు ప్రభావితం అవుతాయి. ఒడిశాలో తుఫాను బలహీనపడడంతో గాలులు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. 28 రాత్రి నుంచి 29 ఉదయం మధ్య దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు.
● పుకార్లను నమ్మవద్దు: ఐఎండీ డీజీ
మోంథా తుఫానుకు సంబంధించిన ఎలాంటి పుకార్లను నమ్మవద్దని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు. 28వ తేదీ మంగళవారం సాయంత్రం నుంచి 29వ తేదీ ఉదయం వరకు వాతావరణం ఉధృతంగా ఉంటుందన్నారు. దక్షిణ ఒడిశాలో వర్షాలు ప్రారంభమై వర్షపాతం క్రమంగా పెరుగుతుందని పేర్కొన్నారు. 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. వర్షాలు వరి పంటను దెబ్బతీస్తాయని, పూరిళ్లు ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.
మోంథా తుఫాను ప్రభావంతో ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితుల కారణంగా గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ సమీపంలోని సముద్రంలో 28 ఫిషింగ్ ట్రాలర్లు చిక్కుకుపోయాయి. గోపాల్‌పూర్ ఓడరేవు నుంచి ఒక పెద్ద నౌక సహాయక చర్యల కోసం సముద్రంలోకి వెళ్లింది. 28 ట్రాలర్లను గోపాల్‌పూర్ ఓడరేవుకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధిక ఆటుపోట్లు మరియు అల్లకల్లోలమైన సముద్ర ఉపరితలం కారణంగా ట్రాలర్లు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించలేకపోయాయి. పడవల్లో మత్స్యకారులు ఉండడంతో జిల్లా యంత్రాంగం తక్షణ సహాయ చర్యలను అభ్యర్థించింది. దీనికి ప్రతిస్పందనగా గోపాల్‌పూర్ పోర్ట్ అధికారులు అన్ని ట్రాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలను ప్రారంభించారు.
కొండ చరియలు విరిగిపడే అవకాశం
తుఫాను వాతావరణం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా కళింగ ఘాటి కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి దృష్ట్యా ఈ మార్గం వినియోగాన్ని నివారించారు. కళింగ ఘాట్ రోడ్లపై అడ్డుకట్టలు ఏర్పాటు చేసి వాహనాల రవాణా స్తంభింపజేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున సమీపంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున రోడ్డును సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం సముద్రంలో మత్స్యకారులు ఎవరూ లేరని రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డు హెలికాప్టర్లు సముద్రంలో తనిఖీ చేశాయి. సముద్రంలో చేపల వేట పడవల కదలిక కోసం వారు తనిఖీ చేశారు. తనిఖీ తర్వాత సముద్రంలో ఒడిశా నుంచి నావికులు లేనట్లు తేలింది. ఇంతకుముందు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు గోపాల్‌పూర్ తీరానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో వారికి వసతి మరియు ఆహారం ఏర్పాట్లు చేశారని మంత్రి వివరించారు.
రాయగడ: మోంథా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. తమ గమ్యాలకు చేరుకునేందుకు ప్రయాణికులు బస్సుల కోసం ఎగబడుతున్నారు. రాయగడ మీదుగా కొరాపుట్, మల్కన్‌గిరి, జయపురం, నవరంగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండులో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో పలువురు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ డెస్క్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అత్యవసర సమయాల్లో ప్రయాణికులకు తాజా సమాచారాన్ని అందించేందుకు రైల్వే విభాగం ఈ మేరకు చర్యలు తీసుకుంది
పునరావాస కేంద్రాలకు 118 మంది గర్భిణులు
పునరావాస కేంద్రాలకు 118 మంది గర్భిణులు
పునరావాస కేంద్రాలకు 118 మంది గర్భిణులు


