రాయగడ జిల్లాలో 164 సురక్షిత ప్రాంతాల ఏర్పాటు
రాయగడ: మోంథా తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పదకొండ సమితుల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన యంత్రాంగం ఈ మేరకు 164 సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 7586 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గల వందమందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అత్యవసర సమావేశంలో సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ధన,ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.
భువనేశ్వర్: మోంథా తుఫాన్ భయాందోళనలతో ప్రజలు అవసరాలకు మించి బంగాళాదుంపలు వంటి నిత్యావసర పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక మార్కెట్లలో విక్రేతలు ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు కృత్రిమ కొరత సష్టించి మరింత బెంబేలెత్తిస్తున్నారు. భువనేశ్వర్, కటక్, బరంపురం వంటి ప్రముఖ ప్రాంతాల్లో కొరత భయంతో చాలామంది వినియోగదారులు బంగాళాదుంపలు ఒకేసారి 4 నుంచి 5 కిలోల కొనుగోలు చేస్తున్నారు. దీనితో స్థానిక విక్రేతలు ధరలు పెంచారు. రాష్ట్రంలో అవసరమైన నిత్యావసర వస్తువులు ముఖ్యంగా బంగాళాదుంపలు పుష్కలంగా ఉన్నాయని, ఒడిశా వ్యాపారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సుధాకర్ పండా ప్రజలకు హామీ ఇచ్చారు. గత రెండు రోజులుగా కోల్‌కతా నుంచి తాత్కాళిక సరఫరా అంతరాయాలు ఉన్నప్పటికీ, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో తగినంత బంగాళాదుంప నిల్వలు ఉన్నాయన్నారు. కోల్‌కత్తాలో ఇంధన సరఫరా దుకాణాలు మూసివేయడంతో రాష్ట్రానికి బంగాళాదుంపలు రవాణా తాత్కాళికంగా స్తంభించింది. సోమవారం నుంచి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది ట్రక్కులు రవాణా మొదలైంది. మంగళవారం ఉదయం సరికి నిల్వలు యథాస్థితికి చేరుతాయన్నారు. ప్రస్తుతం బంగాళాదుంపల ధర కిలోకు రూ.20 వరకు ఉంది. కొంతమంది చిరువ్యాపారులు కొన్ని మార్కెట్లలో కిలోకు రూ.25 చొప్పున అమ్ముతున్నారని తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదు. నిల్వ స్థిరంగా కొనసాగుతోంది. తగినంతగా ఉందని హామీ ఇచ్చారు. తుఫాన్ హెచ్చరికల సమయంలో బ్లాక్ మార్కెటింగ్, ధరల తారుమారుకి పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల సమాఖ్య హెచ్చరించింది. కృత్రిమ కొరతను నివారించడానికి అధికారుల సమన్వయంతో పరిస్థితి అనుక్షణం సమీక్షిస్తున్నారు.
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ప్రాంతంలో ట్రాక్టర్ యజమానుల సంఘం ఏర్పాటైంది. సంఘ నాయకులు సోమవారం సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల దాడులతో ఎదుర్కొంటున్న సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. ఇసుక, చిప్స్, మెటల్, రాయి, మురుమ్ తరలించే సమయంలో అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతోపాటు రూ. 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు జరిమానాలు విధిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ట్రాక్టర్ యజమానులు నెలవారీ ఫైనాన్స్ కిస్తీలను చెల్లించడానికి కష్టాలు ఎదుర్కొంటుంటే అధికారుల దాడులు, కేసులతో మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చైతన్య చౌదరి, కార్యదర్శిగా గంగా మాడి, ఖజాంచీగా గౌతమ్ మిశ్రా , ఉపాధ్యక్షుడుగా మధుసూదన్ మాడి, సంయుక్త కార్యదర్శిగా పరిమళ్ మిశ్రా, మీడియా సెల్ ఇన్‌చార్జిగా సుమన్ పాల్, లీగల్ అడ్వయిజర్‌గా గోపాల్ విశ్వస్, ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరిని సభ్యులుగా ఎన్నుకున్నారు.


