మాల్యవంత్ మహోత్సవాలు
సమావేశంలో అధికారుల నిర్ణయం
డిసెంబర్ 14 నుంచి 18 వరకు..
మల్కన్‌గిరి: ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే మాల్యవంత్ మహోత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు. ఉత్సవాలను స్థానిక డీఎన్‌కే క్రీడా మైదారంలో డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకూ జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా నవంబర్ 30వ తేదీన జిల్లాలోని ఏడు సమితుల నుంచి పవిత్ర నదీ జలాలు సేకరించి స్థానిక బైరవీ మందిరం వద్దకు తెచ్చి అక్కడ నుంచి భారీ ఉరేగింపుతో జగన్నాథ్ మందిరంలో ఉంచాలని నిర్ణయించారు. 1, 2, 3 తేదీల్లో సమితిస్థాయిలో ఉత్సవాలు జరుపుతారు. అనంతరం పర్వతోరోహణ, పడవ పందాలను నిర్వహించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, జెడ్పీ ఉపాధ్యక్షుడు పతిత పావన్ వైద్య, డీఎఫ్‌వో సాయికిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, డీఆర్‌డీఏ అధికారి ప్రమిళా మాఝి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాల్యవంత్ మహోత్సవాలు


