నెల రోజులుగా అంధకారంలోనే..
జయపురం: జయపురం సమితి భరిణిపుట్ పంచాయతీ గదియగుడ గ్రామం నెల రోజులుగా అంధకారంలో మగ్గుతోంది. విద్యుత్ అధికారులకు, సిబ్బందికి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గదియగుడ గ్రామ ప్రజలు ఆరోపించారు. సోమవారం ఆ గ్రామం అజాద్ యువజన సంఘం కార్యకర్తలు టాటా విద్యుత్ సప్లై విభాగ కార్యనిర్వాహక ఇంజినీర్ అజయ చౌదురిని కలసి ఒక వినతి పత్రం సమర్పించారు. అందులో టాటా విద్యుత్ కంపెనీ ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా తమ గ్రామంలో గత నెల రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. తాము విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నామని అయినా గత నెల రోజుల కంటే ఎక్కువగా కరెంటు లేదని తెలిపారు. ఆన్‌లైన్‌లో అధికారులకు, సంబంధిత సిబ్బందికి ఫిర్యాదులు పంపినా స్పందించడం లేదని ఆ గ్రామ అజాద్ యువజన సంఘం సాధారణ కార్యదర్శి జితేంద్ర నాయిక్ విద్యుత్ ఇంజినీర్‌కు అందజేసిన లేఖలో వెల్లడించారు. తమ గ్రామ విద్యుత్ సరఫరా బాధ్యతలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమే తమ గ్రామ అంధకారానికి కారణమని ఆరోపించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు విచ్ఛిన్నమైతే సిబ్బంది వెంటనే రిపేరు చేయాలని, కానీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణం గ్రామానికి విద్యుత్‌సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆజాద్ యువజన సంఘ సభ్యులు ఈశ్వర మహంతితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


