కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో అత్యవసర సేవలు
కొరాపుట్: తుఫాన్ నేపథ్యంలో కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో అత్యవసర సేవలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సోమవారం కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి 28,29,30 తేదీల్లో సెలవులు రద్దు చేసినట్లు ప్రకటించారు. సమితి, తహసీల్దార్ కార్యాలయాలు 24 గంటలూ పని చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. రైతులకు పంట నష్టం కలగకుండా సహాయం అందిస్తామన్నారు. ఏదైనా నష్టం వస్తే ప్రభుత్వం పరిహారం ఇస్తుందన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ సత్యవాన్ ప్రకటించారు. మరో వైపు ప్రముఖ పర్యటక కేంద్రాల వద్దకు ఈ మూడు రోజులు పర్యాటకులు రావద్దని ప్రజా ప్రతినిధులు కోరారు. కొత్త వలస–కిరండోల్ రైలు మార్గంలో కొరాపుట్–జగదల్‌పూర్ మధ్య అన్ని ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. విశాఖ పట్నం, భువనేశ్వర్, రూర్కెలా, కోల్‌కతా మార్గాలకు రాకపోకలు నిలిచి పోయాయి. మరో వైపు కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలలో సోమవారం తేలిక పాటి జల్లులు పడ్డాయి.
అవినీతికి దూరంగా ఉండాలి
పర్లాకిమిడి: ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని అధికారులు అన్నారు. అవినీతి నివారణ సచేతన వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం గజపతి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోలతో అవినీతికి దూరంగా ఉంటామని ప్రమాణం చేయించారు. అవినీతి, లంచం తీసుకోకుండా ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రమాణపాఠాన్ని ఆదనపు కలెక్టర్ జగన్నాధ పాడి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సాల్మన్ రైకా చదివి వినిపించారు. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, ఆదనపు పౌరసరఫరాల శాఖ అధికారి సుహాన్స్‌భోయి, డీపీఐఆర్‌వో ప్రదిప్త గురుమయి పాల్గొన్నారు.
కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో అత్యవసర సేవలు


