రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రాయగడ: స్థానిక రాణిగుడఫారానికి చెందిన కేకే పాత్రో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఆయన మంగళవారం కోర్టుకు సంబంధించిన కాగితాలను పంపిణీ చేసేందుకు సైకిల్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఒక బైకు అతనిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తల, చేతికి గాయాలయ్యాయి. అక్కడివారు వెంటనే అతడిని చికిత్స కోసం ఆటోలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బైకు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బోండఘాటిలో ఈదురుగాలులు
మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి బోండఘాటీపై తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు ప్రభావం చూపాయి. దీంతో అక్కడి గిరిజనులను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలను ఇళ్లలోనే ఉండమని సూచించారు. ఒకవేళ వర్షం పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని పేర్కొన్నారు. అటవీ శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
20 సెల్‌ఫోన్లు స్వాధీనం
జయపురం: ఆపరేషన్ ఆఫ్ మిస్సింగ్ మొబైల్ ఫోన్‌లో భాగంగా జయపురం పట్టణ పోలీసులు పలువురు దొంగల నుంచి 20 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారికి అందజేసినట్లు జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్ వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్, ఎస్‌ఐ సిద్దార్థ బెహర తదితరులు పాల్గొన్నారు.
వినతుల వెల్లువ
జయపురం: స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతులు వెల్లువెత్తాయి. కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో 47 వినతులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, ఐఏఎస్ అధికారి సంతోష్ ప్రదాన్, సమగ్ర ట్రైబల్ డవలప్‌మెంట్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ తృప్తి బొరాయి తదితరులు పాల్గొన్నారు.
ఏనుగుల బీభత్సం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి హజారిడంగ్ పంచాయతీ లెలిబడి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని రాయిధుపాణి స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు నిర్వహిస్తున్న కోళ్ల ఫారంను అదేవిధంగా బయోప్లక్ చేపల పెంపకం కేంద్రంను ధ్వంసం చేశాయి. దీంతో రూ.లక్షల్లో నష్టం వాటిళ్లింది. సుమారు మూడు ఏనుగులు సోమవారం రాత్రి గ్రామంలోకి చొరబడి అరటి, పనస తదితర పంటలను ధ్వంసం చేయడంతో పాటు కోళ్లఫారం, చేపల పెంపక కేంద్రాలను నేలమట్టం చేశాయి. దీనిపై బిసంకటక్ అటవీ శాఖ రేంజర్ హేమ్ బెహరను సంప్రదించగా ఏనుగుల సంచారం విషయమై అప్రమత్తంగా ఉన్నామన్నారు. సమీప అడవుల నుంచి అవి ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలియజేశారు. ఏనుగు దాడుల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరుపున సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


