
పేద విద్యార్థులకు అండగా ఉంటాం
రాయగడ: నిరుపేదలైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారికి అండగా నిలవాలని తమ సంఘం భవిష్యత్ ప్రణాళికలో రూపొందిస్తున్నామని శిష్ట కరణాల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పట్నాయక్ అన్నారు. స్థానిక స్వాగత్ హోటల్ సమీపంలోని శ్రీరామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పేద విద్యార్థులకు అండగా నిలవాలన్నది ధ్యేయంగా పనిచేసేందుకు అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన నుంచి విద్యాదానం పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సంఘం వనమహోత్సవాన్ని డిసెంబర్ 24వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యుత్‌షాక్‌తో గాయపడిన సోమేష్ అనే వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థికసాయాన్ని సంఘం తరఫున అందించారు. సమావేశంలో సంఘం కార్యదర్శి పి.మహేష్ పట్నాయక్, సహాయ కార్యదర్శి సారధి పట్నాయక్, బాలక్రిష్ణ పట్నాయక్, కె.కె.ఎం.పట్నాయక్, కోశాధికారి లక్ష్మీ ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారు.