
సైబర్ నేరాలపై అవగాహన
రాయగడ: ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ ఆదేశాల మేరకు కళ్యాణసింగుపూర్‌లో మంగళవారం సైబర్ సురక్షపై పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా చైతన్య రథాన్ని ఎస్‌డీపీఓ గౌరహరి సాహు ప్రారంభించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో సైబర్ విభాగం డీఎస్పీ అవినాష్ రెండ్డి, హెచ్‌ఆర్ పీసీ సంతోష్‌కుమార్ సతపతి, ఐఐసీ నీలకంఠ బెహర, ఏఎస్‌ఐ హేమంత్‌కుమార్ బరడి తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ దగ్ధం
భువనేశ్వర్: స్థానిక నీలాద్రి విహార్ సెక్టార్–4 ప్రాంతంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోర్ రూమ్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే షాపులోని స్కూటర్లు కాలిపోయాయి. మంటలకు కారణం తెలియలేదు.
తేనేటీగల దాడిలో
ఐదుగురికి గాయాలు
రాయగడ: తేనెటీగల దాడిలో ఐదుగురు గాయాలపాలయ్యారు. జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ అటవీ రేంజ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిలో కమలా హికక, ఇలిగ కడ్రక, జి.నాగభూషణరావు, జి.త్రిపాఠి, ఇరుపతి నాయుడు ఉన్నారు. వీరంతా కళ్యాణ సింగుపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
రైలు ఢీకొని యువతికి గాయాలు
రాయగడ: స్థానిక పితామహాల్ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద బుధవారం రైలు ఢీకున్న ఘటనలో ఓ యువతి తీవ్రగాయాలపాలయ్యింది. సదరు సమితి పితామహాల్ పంచాయతీలోని కొందోకిలుము గ్రామానికి చెందిన తులసి ఉలక ప్రమాదానికి గురైనట్లు రైల్వే వర్గాలు తెలియజేశాయి. రాయగడ మీదుగా విజయనగరం వెళ్లే గూడ్స్ రైలు వస్తున్న కారణంగా లెవెల్ క్రాసింగ్ గేటును మూసివేశారు. ఈ క్రమంలో తులసి లెవెల్ క్రాసింగ్ దాటుతున్న సమయంలో గూడ్స్ ఆమెను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలకు గురైన ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న రాయగడ, శెశిఖాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగపాటుకు
యువకుడు బలి
రాయగడ: పిడుగు పాటుకు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి నారాయణపూర్ పంచాయతీ పరిధి సనొతొండ్ర గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన బొగి నచిక (20)గా గుర్తించారు. మంగళవారం సాయంత్రం పచ్చగడ్డి కోసం సమీపంలోని అడవులకు వెళ్లాడు. అదే సమయంలో వర్షం కురవడంతో పాటు ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో నచిక సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. అటువైపుగా వెళ్లిన కొందరు గ్రామస్తులు చూసి ఈ విషయాన్ని నచిక తండ్రి కృష్ణ నచికకు తెలియజేశారు. విగతజీవుడై పడి ఉన్న కొడుకు మృతదేహాన్ని చూసి గ్రామస్తుల సహాయంతో ఇంటికి తీసుకువెళ్లాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణ సింగుపూర్ పీహెచ్‌సీకి తరలించారు.

సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలపై అవగాహన