
ఉప ఎన్నికకు సన్నద్ధం
● పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు
● పోలీసు ఉన్నతాధికారుల
సమీక్షలో డీజీపీ యోగేష్
భువనేశ్వర్: నవంబర్ 11న నువాపడా శాసనసభ నియోజక వర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) యోగేష్ బహదూర్ ఖురానియా తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ప్రముఖుల కదలికల భద్రతకు సంబంధించి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని దేశించారు. సీఆర్పీసీ సెక్షన్ 107, 110 కింద అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయడం, అక్రమ డబ్బు ప్రవాహాన్ని అరికట్టడం, అక్రమ ఆయుధాలు, మద్యం స్వాధీనం చేసుకోవడం వంటి నివారణ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. పోలింగ్ రోజుకు ముందే పెండింగ్‌లో ఉన్న నాన్–బెయిలబుల్ వారెంట్లను (ఎన్‌బీడబ్ల్యూ) అమలు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల చొరబాటు నివారణకు మొబైల్ పెట్రోలింగ్ బలోపేతం చేయాలని సూచించారు.
● ఫ్లయింగ్ స్క్వాడ్‌లను మోహరింపుతో పాటు కీలకమైన ప్రవేశ కేంద్రాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) సంజయ్ కుమార్ సూచించారు.
● రాష్ట్ర నిఘా విభాగం డైరెక్టర్ ఆర్. పి. కోచే మాట్లాడుతూ నియోజకవర్గం, పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని డీఐజీలు, ఎస్పీలను కోరారు.
● మావోయిస్టుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు, మావోయిస్టు వ్యతిరేక డ్రైవ్‌లను ముమ్మరం చేసినట్లు ఏడీజీపీ (నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్) సంజీవ్ పండా తెలిపారు. ప్రశాంతమైన పోలింగ్ జరిగేలా సమగ్ర భద్రతా ప్రణాళికలను రూపొందించినట్లు వివరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు సిబ్బందితో పాటు మొత్తం 14 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ దళం (సీఏపీఎఫ్), 5 ప్లాటూన్ల ఓఎస్‌ఏపీ/ఏపీఆర్, 35 మొబైల్ పెట్రోలింగ్ యూనిట్లు, 18 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 18 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (ఎస్‌ఎస్ టీ) మోహరిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డీజీపీ (క్రైమ్ శాఖ) వినయ్‌తోష్ మిశ్రా, డైరెక్టర్ (నిఘా) ఆర్.పి.కోచే, అదనపు డీజీపీ (ప్రధాన కార్యాలయం) అరుణ్ బోత్రా, అదనపు డీజీపీ (ఎస్‌ఏపీ) రాజేష్ కుమార్, ఇనస్పెక్టర్ జనరల్ (ఎస్‌ఏపీ) ఎస్.కె. గజ్వియే సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.