
పైసలిస్తేనే పనులు..?
ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్
కార్యాలయంలో అక్రమాలు
అక్రమార్జనే ధ్యేయంగా అధికారులు
రిజిస్ట్రేషన్లకు భారీగా వసూళ్లు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆమదాలవలస రూరల్: అక్రమార్జనలో ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్రగామిగా నిలుస్తోంది. దస్త్రావేజులకు అక్రమ ధరలు పలికించడంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది కీలకంగా నిలుస్తున్నారు. వాస్తవంగా భూములకు సంబంధించి క్రయ, సెటిల్‌మెంట్, కుటుంబ పంపకం, సవరణ, మార్ట్‌గేజ్ వంటి దస్త్రావేజులు నిత్యం రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. అయితే భూములకు సంబంధించి గానీ, నివాస స్థలానికి సంబంధించి గానీ చిన్న, చిన్న తప్పులను బూచీగా చూపించి తిరస్కరణ పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్లలో భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో దస్త్రావేజుకు సుమారుగా రూ.10 వేలు నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా తహసీల్దార్ సర్వే నంబర్ నిర్ధారణ కోసం జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రూ.10 వేలు నుంచి రూ.50 వేల వరకు ఇక్కడ సిబ్బంది వసూలు చేస్తున్నారు.
జీతాల కంటే అక్రమార్జనే ఎక్కువ
ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే జీతాలు కంటే అధిక మొత్తంలో నిత్యం అక్రమార్జన చేకూరుతోంది. దీంతో భూములు కొనుగోలు చేసినవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఈ కార్యాలయానికి రావాలంటే భయపడుతున్నారు. వాస్తవంగా ఇటీవల ఆమదాలవలస మున్సిపాలిటీలోని రావికంటిపేటకు చెందిన ఒక వ్యక్తి వద్ద సర్వే నంబర్‌ను తప్పుగా చూపించి రూ.లక్షల్లో వసూలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా ఇదే మున్సిపాటీలోని అక్కివలస రెవెన్యూ గ్రామంలో లింక్ దస్త్రావేజులో చిన్న తప్పును చూపించి ఇదే తరహాలో దోచుకున్నారు. అలాగే ప్రభుత్వం గతంలో అందించిన కాలనీలు ప్రభుత్వ భూములు అయినందున రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉండదు. అయితే ఇటీవల కాలంలో ఆమదాలవలస మున్సిపాలిటీ, ఐ.జె.నాయుడు కాలనీ, సొట్టవానిపేట కాలనీ తదితర ప్రాంతాల్లో అనేక గ్రామాల నుంచి గ్రామకంఠం సర్వే నంబర్‌తో తహసీల్దార్లు, వీఆర్వోలు అందించిన ధ్రువీకరణ పత్రాలతో పలు రిజిస్ట్రేషన్లు చేయించి రూ.లక్షల్లో దోచుకునే దందా ఈ కార్యాలయంలో కొనసాగుతుండడం గమనార్హం.
కార్యాలయంలో కలెక్షన్ కింగ్
ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక సాధారణ ఉద్యోగి చక్రం తిప్పుతున్నాడు. దస్త్రావేజులకు అక్రమ ధరలు నిర్ధారించడంలో ఆయనకు సాటి మరొకరు ఉండరనే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సాధారణ ఉద్యోగి కార్యాలయంలో కొందరు బినామీ ఉద్యోగులను ఏర్పాటు చేసుకొని భూ కొనుగోలు దారులనుంచి భారీ ముడుపులు అందుకుంటున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఉండే కొందరు లేఖర్లును అడ్డం పెట్టుకొని, అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు అక్కడ పనిచేసే అధికారి కూడా ఏమీ చేయలేరనే విధంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇక్కడ జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల నియంత్రణపై జిల్లా అధికారులు కూడా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందువలన ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు అమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

పైసలిస్తేనే పనులు..?