మాదినకు రైతునేస్తం పురస్కారం | - | Sakshi
Sakshi News home page

మాదినకు రైతునేస్తం పురస్కారం

Oct 23 2025 6:29 AM | Updated on Oct 23 2025 6:29 AM

మాదిన

మాదినకు రైతునేస్తం పురస్కారం

కంచిలి: మండలంలోని పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ మాదిన ప్రసాదరావు పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారానికి ఎంపికై నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కూడా ఇతను పశుసంవర్ధక శాఖలో అందిస్తున్న సేవలకు పలు అవార్డులు లభించాయి. తాజాగా రైతునేస్తం పురస్కారానికి ఎంపికై నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని శంషాబాద్‌ దగ్గరలో ఉన్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారని వెల్లడించారు.

మాజీ నక్సలైట్‌ అప్పారావు మృతి

పలాస: మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌, అమరవీరుడు తామాడ గణపతి సహచరుడు బొడ్డు అప్పారావు (80) అనారోగ్యంతో బుధవారం ఉదయం తన స్వగృహంలో మృతి చెందారు. ఉద్దానం ప్రాంతానికి చెందిన వివిధ విప్లవ ప్రజా సంఘాల కన్నీటి వీడ్కోలు మధ్య అంతమ యాత్ర చేపట్టి ఘనంగా అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో వక్తలు మాట్లాడుతూ అప్పారావు శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొని, అనేక కష్టాలను ఎదుర్కొని బొడ్డపాడు గ్రామాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. బొడ్డపాడు హైస్కూల్‌కు ఉపాధ్యాయులు కావాలని, బీసీ వసతి గృహం కావాలని, ఉద్దానం ప్రాంతానికి మంచినీటి సదుపాయం కావాలని తదితర డిమాండ్లతో 21 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేపట్టి వాటిని సాధించి పెట్టిన వ్యక్తి అని కొనియాడారు. గ్రామంలో యువకులను రాజకీయంగా చైతన్యం చేసి గ్రామాన్ని ఐక్యంగా నడిపించిన గొప్ప నాయకుడన్నారు. ఆయన మృతి గ్రామానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ విప్లవ పార్టీల నాయకులు దాసరి శ్రీరాములు, గొరకల బాలకృష్ణ, తామాడ సన్యాసిరావు, మద్దిల రామారావు, దున్న గోవిందరావు, సాలిన వీరాస్వామి, సర్పంచి తామాడ మదన్‌, పోతనపల్లి కుసుమ, బత్తిన కృష్ణమూర్తి, పోతనపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

కొలిక్కి వస్తున్న చోరీ కేసులు

శ్రీకాకుళం క్రైమ్‌: ఇటీవల గార మండలం కళింగపట్నం పోర్టు కేంద్రంగా వరుస ఇళ్లల్లో జరిగిన చోరీకి సంబంధించిన కేసు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కాకినాడకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు, వారి వద్ద నుంచి కొంత బంగారాన్ని రికవరీ చేసి, మరికొంత రికవరీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నిందితులు జిల్లాలోని కళింగపట్నం, దూసి, గార, నందగిరిపేట, మరికొన్ని ప్రాంతాల్లో సైతం చోరీలకు పాల్పడినట్లు సమాచారం. ఒక్కొక్కరూ 10 నుంచి 20కు పైగా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

విజయవంతం చేయండి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం జిల్లాలో ఉన్న పీఏసీఎస్‌ ఉద్యోగులంతా విజయవాడలోని రాష్ట్ర సహకార బ్యాంకు వద్ద ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ స్టేట్‌ పీఏసీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్‌, జిల్లా అధ్యక్షుడు లోలుగు మోహనరావు, ప్రధాన కార్యదర్శి బి.రామారావులు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రులు, కమిషనర్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లావ్యాప్తంగా ఓపెన్‌ హౌస్‌

శ్రీకాకుళం క్రైమ్‌: అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో బుధవారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయుధాలు, ట్రాఫిక్‌ పరికరాలు, నియమాలు, సైబర్‌ క్రైమ్‌పై వివరించారు. రోజువారీ ఉపయోగించే సాంకేతిక పరికరాలు, వైర్‌లెస్‌ సెట్‌ కమ్యూనికేషన్‌, బాంబ్‌ డిస్పోజల్‌ సామాగ్రి, పోలీసు జాగిలాలు, డ్రోన్స్‌ పనితీరు, బాడీ వార్న్‌ కెమెరాలు, బ్రీత్‌ ఎనలైజర్స్‌, పేలుడు పదార్థాల గుర్తింపు, సిగ్నల్స్‌, స్పీడ్‌గన్‌, గ్యాస్‌ గన్‌లను చూపించి వివరించారు. రిసెప్షన్‌, విశ్రాంతి, కంప్యూటర్‌, ప్రాపర్టీ, లాకర్‌ రూమ్‌లను చూపించి ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు, దర్యాప్తు, ఛార్జిషీటు వంటి అంశాలను తెలియజేశారు.

మాదినకు రైతునేస్తం పురస్కారం 1
1/2

మాదినకు రైతునేస్తం పురస్కారం

మాదినకు రైతునేస్తం పురస్కారం 2
2/2

మాదినకు రైతునేస్తం పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement