
సమైక్య ఒడిశా నిర్మిద్దాం
● గవర్నర్ పిలుపు
భువనేశ్వర్: ఉత్కళ కేసరి డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ ఆదర్శాలు, దార్శనికతను ప్రతిబింబించే సుసంపన్న, శక్తివంతమైన, స్వావలంబనతో కూడిన సమైక్యమై ఒడిశాను నిర్మించడానికి కలిసి పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కోరారు. కటక్ నగరంలో సరళ భవన్‌లో జరిగిన డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ 125వ జయంతి వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ గొప్ప నాయకుల జీవితం కేవలం గుర్తుంచుకోవాల్సిన కథ మాత్రమే కాదు అనుసరించాల్సిన సందేశం అని అన్నారు. ఆయన ప్రయాణంలోని ప్రతి అధ్యాయం మనకు దృఢ సంకల్పం, ధైర్యం, దార్శనికతతో జీవించడానికి స్ఫూర్తినిస్తుందన్నారు.
డాక్టర్ మహతాబ్ జమిందారు కుటుంబంలో జన్మించినప్పటికీ, త్యాగం, ప్రజా సేవతో కూడిన జీవితాన్ని ఎంచుకున్నారని డాక్టర్ కంభంపాటి పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చేరడం ద్వారా, నిజమైన నాయకత్వం అంటే వ్యక్తిగత సుఖం కంటే సామూహిక సంక్షేమం పరిరక్షణ శక్తివంతమైనదనే సందేశం ఆదర్శప్రాయంగా పేర్కొన్నారు. వికసిత్ ఒడిశా కోసం, పరివర్తనాత్మక మార్పు కోసం పనిచేయడానికి మార్గనిర్దేశం చేయాలి అని ఆయన అన్నారు.
ఆధునిక ఒడిశాను రూపొందించడంలో డాక్టర్ మహతాబ్ దార్శనిక పాత్రను హైలైట్ చేస్తూ, భువనేశ్వర్‌ను రాష్ట్ర కొత్త రాజధానిగా స్థాపించడం, హిరాకుడ్ ఆనకట్టను నిర్మించడం, పరిశ్రమలు మరియు విద్యా సంస్థలను ప్రోత్సహించడంలో ఆయన చేసిన చొరవలను డాక్టర్ కంభంపాటి గుర్తుచేశారు. ‘ఇవి కేవలం పాలనా చర్యలు మాత్రమే కాదు, స్వావలంబన మరియు సాధికారత కలిగిన ఒడిశాను నిర్మించడంలో మైలురాళ్లు’ అని ఆయన అన్నారు. రచయిత, సంపాదకుడు, సామాజిక సంస్కర్తగా ప్రజాతంత్ర, ఝంకార్ ద్వారా ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పిన డాక్టర్ మహతాబ్ సహకారాన్ని కూడా గవర్నర్ ప్రశంసించారు. ‘ఒడిశా ఆత్మ దాని భాష, సంస్కృతి వారసత్వంలో ఉంటుందని ఆయన విశ్వసించారు‘ అని డాక్టర్ కంభంపాటి అన్నారు.
సరళ సాహిత్య సంసద్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గవర్నర్ ప్రశంసిస్తూ, ఒడిశాకు ఉజ్వల భవిష్యత్‌ను రూపొందించడానికి ధైర్యం, సమగ్రత, దూరదృష్టితో డాక్టర్ మహతాబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరినీ కోరారు. కటక్ ఎంపీ భర్తహరి మహతాబ్, ప్రొఫెసర్ ఖారవేళ మహంతి, సరళ సాహిత్య సంసద్ అధ్యక్షుడు ప్రభాకర్ స్వంయి, మాజీ ప్రధాన కార్యదర్శి, రచయిత సహదేవ సాహు, ప్రొఫెసర్ నిరంజన్ త్రిపాఠి, సరళ సాహిత్య సంసద్ కార్యదర్శి మాట్లాడారు.

సమైక్య ఒడిశా నిర్మిద్దాం