
471 పంచాయతీ కార్యాలయాలకు శంకుస్థాపన
భువనేశ్వర్: గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన మెరుగుదల కోసం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం లోక్ సేవా భవన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 471 గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంత్యోదయ గృహ యోజన మొదటి విడతను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి అంత్యోదయ గృహ యోజన కింద 48,693 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 40,000 చొప్పున పంపిణీ చేశారు. గ్రామీణ ఒడిశాలోని నిరుపేద కుటుంబాలకు పక్కా ఇల్లు అందించడం ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు. నువాపడా, కలహండి మినహా అన్ని జిల్లాల్లో 471 గ్రామ పంచాయతీ కార్యాలయాలకు శంకుస్థాపనలు జరిగాయి. ప్రతి కార్యాలయం రూ.35 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. కేంద్రం, రాష్ట్రం సంయుక్త నిధులతో ఈ భవనాలు నిర్మించి వన్–స్టాప్ సేవా కేంద్రాలుగా పనిచేయిస్తారు. సర్పంచ్, పంచాయతీ కార్యనిర్వహణ అధికారి, జూనియర్ ఇంజనీర్, గ్రామ రోజ్‌గార్ సేవక్, అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం ఈ సముదాయంలో ప్రత్యేక గదులను కలిగి ఉంటాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజా సేవల పంపిణీ, పాలనను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను ఈ చొరవ ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ఏడాది మార్చి 30న ప్రారంభించబడిన అంత్యోదయ గృహ యోజన 2027–28 నాటికి పేదల కోసం 5 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్‌లో రూ.7,550 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి లబ్ధిదారునికి 3 విడతలుగా సమగ్రంగా రూ. 1.20 లక్షలు అందజేస్తారు. తొలి విడతలో రూ. 40,000, రెండవ విడతలో రూ. 65,000 చివరగా మూడవ విడతలో రూ.15,000. నాలుగు నెలల్లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు రూ. 20,000, 6 నెలల్లోపు పూర్తి చేసిన వారికి రూ. 10,000 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. ప్రస్తుతం 28 జిల్లాల్లో 48 వేల 693 మంది లబ్ధిదారులు తొలి విడత నిధులు అందుకున్నారు. వారందరికి సమగ్రంగా రూ. 1,947.72 కోట్లు పంపిణీ చేశారు. అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు, పైపుల ద్వారా నీటి సరఫరా వంటి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి. ఈ పథకంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతన ఉపాధికి సంబంధించిన నిబంధనలు ఇమిడి ఉన్నాయి. ప్రతి పేద మరియు నిస్సహాయ కుటుంబానికి సురక్షితమైన, శాశ్వత ఆశ్రయం కల్పించడం లక్ష్యం. తద్వారా వారు గౌరవంగా జీవించగలుగుతారని ముఖ్యమంత్రి వివిధ పంచాయతీల లబ్ధిదారులు, సర్పంచ్‌లకు ఉద్దేశించి వర్చువల్‌గా సంభాషించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, తాగు నీటి విభాగం మంత్రి రబీ నారాయణ్ నాయక్ ప్రసంగిస్తూ గ్రామ పంచాయతీ భవనాలు గ్రామీణ పాలనకు కీలకం అని అభివర్ణించారు. పౌరుల అంచనాలకు అనుగుణంగా అట్టడుగు స్థాయిలో సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ భవనాలు ప్రజా సేవ మరియు గ్రామీణాభివృద్ధిలో ఒక కొత్త మైలురాయిగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ డైరెక్టర్ వినీత్ భరద్వాజ్, పంచాయితీ రాజ్ కమిషనర్ కమ్ సెక్రటరీ గిరీష్ ఎస్.ఎన్. స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వంయి, 28 జిల్లాల నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.