
సంస్కారవంతమైన సమాజమే ధ్యేయం కావాలి
● సాహితీ సభలో వక్తలు
జయపురం: కుసంస్కారాన్ని రూపుమాపి సంస్కారవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం కావాలని అందుకు సాహిత్యం బీజం వేయాలని ప్రముఖ ఒడియా దినపత్రిక ప్రమయ జయపురం ఎడిషన్ బ్యూరో, డీజీఎం ప్రకాశ చంద్రదాస్ అన్నారు. ప్రముఖ సాహితీ వేత్తలు హరిహర కరసుధా పట్నాయక్, జానకీ పాణిగ్రహిలు దీపావళి సందర్భంగా సంయుక్తంగా స్థానిక సాహితీ భవనం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సాహితీ సభలో ప్రకాశ చంద్ర దాస్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ధనం, భోగం, విలాసాలే కుసంస్కారానికి మూల కారణాలు అన్నారు. వాటితోనే నేడు సమాజం నడుస్తుండడంతో శాంతి, సంస్కారం, క్రమశిక్షణ, సౌమరశ్యతలకు మనిషి దూరమవుతున్నాడని అన్నారు. బుద్ధుడు, అశోకుడు, మహాత్మాగాంధీ చూపిన నీతి, ఆదర్శం, అహింసలను మనిషి మరిచిపోయి అక్రమ మార్గాలలో వేగంగా ఫలితాలు పొందాలని భావిస్తున్నారని అన్నారు. ఇలాంటి సంస్కృతిని విడనాడాలన్నారు. మన అందమైన భవిత మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రతిఒక్కరూ మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకొని లాభం, మోహం, ఈర్ష్య, ద్వేషం, హింస, అహంకారం విడనాడాలని పిలుపు నిచ్చారు. ఈ దుర్గుణాల నుంచి ప్రజలను దూరం చేసే శక్తి సాహిత్యానికి ఉందన్నారు. సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి మంచి సాహిత్యం అందించాలన్నారు. సాహిత్యకులు, ఉపాధ్యాయుడు డాక్టర్ జుగల్ కిశోర్ మిశ్ర, అధ్యాపకులు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ మాట్లాడుతూ.. సంస్కారాన్ని ఎలా నిరోధించాలి, ఆరోగ్యకరమైన, ఆదర్శ సమాజాన్ని ఎలా నిర్మించాలో వివరించారు. జిన్ను పండ, కాంచన సాహు, ప్రజాపిత బ్రహ్మ కుమారి సంస్థ బీర కిశోర్ హత్త, నిరంజన్ పాణిగ్రహి, మీణతి దాస్, సబిత శతపతిలు సమాజ నిర్మాణంలో సాహిత్యం పాత్రను వివరించారు. కార్యక్రమంలో సినీ నటులు ప్రకాశ మహంతి, డాక్టర్ శుదాంశు శేఖర పట్నాయక్, సురేష్ హత్త, న్యాయవాది మదన మోహననాయిక్, శౌభాగిణి నందో, భారతీ మిశ్ర, ఉమారాణి దాస్, నందినీ పట్నాయక్, మీణ కేతన దాస్, కనకలత రథ్, ప్రమోద్ కుమార్ రౌళో, భారతీ మిశ్ర, అశోక్ కుమార్ పొలాయి, సుక్తా సాయి పాల్గొన్నారు.

సంస్కారవంతమైన సమాజమే ధ్యేయం కావాలి