
సర్వే పూర్తి చేయాలి’
‘గుణుపూర్–తెరువలి ..
రాయగడ: గుణుపూర్–తెరువలి కొత్త రైల్వే నిర్మాణంలో భాగంగా సంబంధిత శాఖ అధికారులు చేపడుతున్న సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణం పనులు ప్రారంభించాలని దిశ చైర్మన్, కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గుణుపూర్ నుండి తెరువలి కొత్త రైల్వే నిర్మాణంలో భాగంగా నయిరా మీదుగా గుడారి వరకు రైల్వే లైన్ అనుసంధానించి రాయగడకు కలపాలన్న ప్రతిపాదన గుర్తించి ప్రస్తావించారు. రాయగడ రైల్వే డివిజన్‌గా గుర్తింపు పొందినప్పటికీ అందుకు సంబంధించిన సౌకర్యాలు ప్రజలు పొందలేకపోతున్నారని ఉలక అన్నారు. అత్యవసర సమయంలో తాత్కాల్ టిక్కెట్ల కొరత తీవ్రంగా ఉందని సమావేశంలొ ప్రస్తావించి, దీనిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. కొరాపుట్–రాయగడ రైల్వే లైన్‌లో గల టన్నెల్‌ల వద్ద తరచూ మట్టి పెల్లలు జారిపడటం వంటి సమస్యలు తరచూ చోటు చేసుకుంటుండటంపై సమీక్షించిన ఆయన అందుకు మార్గంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమత, దుర్గి–రాయిపూర్ ప్యాసింజర్ రైళ్లకు జమిడిపేటలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. సదరు సమితి గుమ్మ ఘాటి మలుపులొ తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గుమ్మ వద్ద టన్నల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాలను కొంతమేర నివారించే అవకాశం ఉంటుందని, అందుకు సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపాలని అన్నారు. అదేవిధంంగా కై లాస్‌పూర్ ఘాటీ మలుపు కూడా అదే తరహా ఉందని అయితే ఈ ఘాట్ రోడ్డు వద్ద విద్యుద్దీకరణ చేస్తే ప్రమాదాల సంఖ్య అరికట్టవచ్చని కోరారు. రాయగడ నుండి కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ వరకు గల రహదారిని మెరుగుపరచాల్సి ఉందని ఉలక అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లొ మొబైల్ సేవలు
జిల్లాలొ గల 11 సమితుల పరిధుల్లో ఉన్న 136 గ్రామాలకు మొబైల్ సేవలు లేవని ఈ గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఉలక అన్నారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.