
తప్పుడు సమాచారం తగదు: సీఈఓ
ఓటర్ల జాబితా సవరణలో..
భువనేశ్వర్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియలో తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారంపై అనుబంధ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్. ఎస్. గోపాలన్ తెలిపారు. ఎస్‌ఐఆర్ – 2026 సన్నాహాల్లో భాగంగా ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌ఎస్ గోపాలన్ అధ్యక్షతన ఆన్‌లైన్ వర్క్‌షాప్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీఈఓ కార్యాలయం నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారులు, మీడియా నోడల్ అధికారులు, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా గోపాలన్ ఎస్‌ఐఆర్ చొరవ లక్ష్యాలు, ప్రాముఖ్యతను అనుబంధ యంత్రాంగానికి వివరించారు. ఈ ప్రక్రియలో స్పష్టత, పారదర్శకతను నిర్ధారించేందుకు సమన్వయంతో కూడిన ప్రయత్నాలకు పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఈసీఐ నిష్పాక్షికంగా, అంకిత భావంతో పని చేయడంతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ఆ ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి, తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని సమర్థంగా ఎదు
ర్కోవడం చాలా ముఖ్యమని సీఈఓ అన్నారు. అర్హులైన ఏ ఓటరు పేరును జాబితా నుంచి తొలగించకూడదు. అనర్హుల పేర్లను చేర్చకూడదని ఆయన పునరుద్ఘాటించారు. డిప్యూటీ సీఈఓ లక్ష్మీ ప్రసాద్ సాహు బీహార్ నుండి ఉదాహరణలను ఉటంకిస్తూ సవరణ ప్రక్రియలోని కీలక అంశాలను ప్రస్తావించారు. బూత్ స్థాయి అధికారుల తప్పులు, నకిలీ జోడింపులు లేదా తప్పు దారి పట్టించే సమాచారాన్ని గుర్తించి తక్షణమే సరిదిద్దాలని అధికారులను కోరారు. అట్టడుగు స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక, డిజిటల్ వేదికల ద్వారా సీఈఓ కార్యాలయం నుండి ధృవీకరించిన సమాచారం, క్రమం తప్పకుండా పత్రికా ప్రకటనలను చురుకుగా వ్యాప్తి చేయాలని ఆయన జిల్లా సమాచారం, ప్రజా సంబంధాల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రం అంతటా పారదర్శకత, కచ్చితత్వాన్ని కొనసాగించడానికి ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా సకాలంలో అమలు చేయాలని సీఈఓ ఆర్.ఎస్. గోపాలన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను సెప్టెంబర్ 26న ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.