
భటగుడలో యువకుడి దారుణ హత్య
మరొకరికి గాయాలు
పోలీసుల అదుపులో నిందితుడు
రాయగడ: జిల్లాలొని బిసంకటక్ సమితి పరిధిలో గల భటగుడ గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని దిలీప్ లెహర (24)గా గుర్తించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. భటగుడ గ్రామంలో మెగా తాగునీటి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పనులను చేసేందుకు కాంట్రాక్టర్ వద్ద పనిచేసేందుకు లంజిఘట్‌కు చెందిన కొందరు కూలీలు ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అంతా భోజనాలు చేసి పడుకునే సమయంలో ఒకే గదిలో దిలీప్ లెహర, కునాల్ లెహరలతొ పాటు లలిత్ మాఝిలు ఉన్నారు. వారిలో ఏదో విషయమై వాగ్వాదాలు కొనసాగాయి. దీంతొ కునాల్ అనే యువకుడు కోపోద్రిక్తుడై ఒక గొడ్డలి సాయంతో దిలీప్‌పై దాడి చేశాడు. అడ్డుకున్న లలిత్‌ను కూడా గాయపరిచాడు. తీవ్రగాయాలకు గురైన దిలీప్ సంఘటన స్థలం వద్దే మృతి చెందగా తీవ్ర గాయాలతో లలిత్ బయటపడ్డాడు. తోటి కూలీలు అక్కడ జరిగిన ఘటనను తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం హత్య చేసిన కునాల్‌లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కునాల్‌లు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భటగుడలో యువకుడి దారుణ హత్య

భటగుడలో యువకుడి దారుణ హత్య