
మిషన్ శక్తి భవనంలో దొంగలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కేంద్రంలో ఉన్న మిషన్ శక్తి భవనంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో మిషన్ శక్తి భవనానికి తాళం వేశారు. దుండగులు తాళం తీసి లోపలకు ప్రవేశించి బీరువాలో ఉన్న ఫైల్స్ దొంగిలించారు. సోమవారం ఉదయం మిషన్‌శక్తి భవనం తీయడం కోసం వస్తే సామాన్లు చిందరవందరగా ఉన్నాయి. దీంతో ధరిత్రీమిషన్ శక్తి అధ్యక్షురాలు పూర్ణిమా దత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐసి ముకుందో మేల్క తన సిబ్బందితో వచ్చి పరిసరాలు పరిశీలించారు.
రాజధానిలో
47 వేల వీధి కుక్కలు
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలిసారిగా రాజధాని నగరంలో వీధి కుక్కల లెక్కింపు చేపట్టారు. స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ ఆధ్వర్యంలో ఈ గణన నిర్వహించారు. ఈ లెక్కల్లో బీఎంసీ పరిధిలో వీధి కుక్కల రేటు జాతీయ రేటు కంటే అధికంగా ఉందని స్పష్టం అయింది. భువనేశ్వర్ నగర పాలక సంస్థ బీఎంసీ ప్రాంతంలో 39,723 వీధి కుక్కలు ఉన్నాయి. నగర జనాభాలో ఈ వీధి కుక్కల సంఖ్య 3.62 శాతంగా నమోదైంది. వాటిలో 23,047 మగ కుక్కలు, 15,552 ఆడ కుక్కలు, 1,124 కుక్కపిల్లలు ఉన్నాయి. 4,068 మగ కుక్కలు, 3,335 ఆడ కుక్కలకు స్టెరిలైజేషన్ జరిగింది.
నగరంలో యువకుడిపై కాల్పులు
భువనేశ్వర్: అన్న (పెద్ద తండ్రి కొడుకు)ను తమ్ముడు (పినతండ్రి కుమారుడు) తుపాకీతో కాల్చి చంపాడు. నగరంలో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. తమ్ముడు 4 రౌండ్లు కాల్పులు జరపడంతో అన్న మృతి చెందాడు. మృతుడిని సుధాంశు ఖుంటియాగా గుర్తించారు. అతని శరీరంలోకి 3 తూటాలు దూసుకు పోయాయి. ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు సమాచారం. పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్ సమాచారం ప్రకారం రెండు కుటుంబాల మధ్య వివాదం కారణంగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడు ఎయిమ్స్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా విధులకు హాజరయ్యేందుకు విచ్చేస్తుండగా వెంబడించి తుపాకీ కాల్పులు జరపడం కలకలం రేపింది.
19 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు ఆ దిశగా విస్తృతంగా దాడులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చంద్రపూర్ పోలీసులు సొమవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా కురులిబలి కూడలిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకుని అతని నుంచి 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు.

మిషన్ శక్తి భవనంలో దొంగలు