కొరాపుట్: హోటల్ ప్రారంభం సందర్భంగా అనాథ పిల్లలకు విందు ఇచ్చి యజమాని దాతృత్వం చాటుకున్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో జగన్నాథ మందిరం సమీపంలో గల పూజా హోటల్ పునః ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో ఈ హోటల్ దగ్ధమైంది. హోటల్ ప్రారంభం సందర్భంగా మజ్జి గుడలోని దీన దయాల్ బాలికా ఆశ్రమం, సింధిగుడలోని ఉత్కళ బాలాశ్రమం, పట్టణంలోని మున్సిపల్ స్వీపర్ కాలనీకి చెందిన సుమారు 200 మంది పిల్లలకు భోజనం పెట్టారు. హోటల్ యజమాని బిభూతి భూషణ్ లెంక బాలలకు స్వాగతం పలికారు. పిల్లలకు నచ్చిన మిఠాయిలు, ఐస్ క్రీంలు, టిఫిన్, బిర్యానీ పెట్టారు. బ్యాగ్‌లు, విద్యా సామగ్రి ఉచితంగా అందజేశారు. అనంతరం పిల్లలందరినీ వారి ఆశ్రమాలకు సొంత ఖర్చులతో బిభూతి భూషణ్ లెంక పంపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి స్వయంగా బాలలకు కావాల్సిన వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నబరంగ్‌పూర్ మున్సిపల్ చైర్మన్ కును నాయక్, సీనియర్ న్యాయవాది జడేశ్వర్ ఖడంగా, కౌన్సిలర్ ఎ.సతీష్ పాల్గొన్నారు.