
ఎయిర్‌పోర్టు సదస్సు బహిష్కరణ
● హాజరు కాని ఉద్దానం రైతులు
● సహకరించాలని ఎమ్మెల్యే వేడుకోలు
పలాస: పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, మందస మండలాల ఉద్దానం ప్రాంతంలో తలపెట్టిన కార్గో ఎయిర్‌పోర్టును ఉద్దానం ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, సంబంధిత రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఎయిర్‌పోర్టు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అవగాహన అంటూ ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఉద్దాన ప్రాంత రైతులు బహిష్కరించారు. ముందురోజే గ్రామ సచివాలయాలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రప్పించి ఎయిర్‌పోర్టుకు అనుకూలంగా మాట్లాడించుకున్నారు. ఎయిర్ పోర్టు చాలా అవసరం అంటూ, ఉద్దానం అభివృద్ధి చెందాలంటే తాము భూములు ఇవ్వడానికి సిద్ధమేనని, అయితే ప్రజల్లో, రైతుల్లో నష్ట పరిహారం విషయమై సందేహాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఎకరా భూమికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా మాట్లాడుతూ ప్రజా సంఘాల నాయకులు రకరకాల రంగుల జెండాలతో ఎక్కడి నుంచో వచ్చి రెచ్చగొడుతున్నారని, పర్యావరణ కాలుష్యం అంటున్నారని, అసలు ఎయిర్‌పోర్టు వద్దంటున్నారని, వారికి అభివృద్ధి అంటే అక్కర్లేదని, వారి ఇళ్ల ముందు మురుగు కాలువలను శుభ్రం చేయరని పరుష పదజాలంతో మాట్లాడారు. ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నానని, ఎయిర్‌పోర్టుకు సహకరించాలని కోరారు.
ఎయిర్ పోర్టుతో మేలే..
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ కార్గో ఎయిర్‌పోర్టు వల్ల ఉద్దానం ప్రజలకు మేరు జరుగుతుందన్నారు. ఉద్దానం రూపురేఖలు మారుతాయన్నారు. చాలా మందికి అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయడానికే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు అభిప్రాయాలు తెలుసుకోకుండా ఒక్క అడుగూ ముందుకు పడదని, రేపటి నుంచి గ్రామాల్లోకి అధికారులు వస్తారని వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎ.పి.స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్‌డీఓ జి.వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు తహశీల్దార్లు పాల్గొన్నారు.