
సమితి అధ్యక్షురాలిపై అవిశ్వాస తీర్మానం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర పంచాయతీ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి పొరజ పదవికి రాజీనామా చేసినా.. ముందుగా సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆమైపె వచ్చిన అవిశ్వాస తీర్మానంపై అధికారులు ఓటింగ్ నిర్వహించారు. రాజేశ్వరి పొరజపై సర్పంచ్‌లు సమితి సభ్యులు పలు ఆరోపణలు చేసి ఆమైపె అవిశ్వాస తీర్మానం తీసుకు వచ్చారు. ఆమె ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అయినా ఆమైపె వచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరిపారు. కుంద్రా తహసీల్దార్, మరుయు మెజిస్ట్రేట్ బినోద్ కుమార్ నాయక్ నేతృత్వంలో పంచాయతీ సమావేశం నిర్వహించారు. అధ్యక్షురాలిపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఎన్నికల నియమం ప్రకారం అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో అవిశ్వాస తీర్మానాన్ని సమర్దిస్తూ 28 మంది ఓటు చేయగా.. వ్యతిరేకిస్తూ ఒక్క ఓటు కూడా పడలేదని అధికారి వెల్లడించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించిన అధికారులు ఓట్లు బ్యాలెట్ బాక్స్‌లో పెట్టి సీజ్ చేశారు. అధ్యక్షురాలు రాజీనామా చేయటంతో అధ్యక్ష ఎన్నికలు జరిగినంత వరకు ఉపాధ్యక్షుడు తురణ సేన్ బిశాయి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలని ఎన్నికల అధికారి తహసీల్దార్ తెలియజేశారు. ఎన్నిక ఫలితాలు వెల్లడి కాగానే ప్రజాప్రతినిధుల్లో, బీజేడీ శ్రేణల్లో ఉత్సాహం వెల్లువిరిసింది. మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మఝి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాధావినోదిని సామంతరాయ్, కుంద్ర బ్లాక్ బీజేడీ అధ్యక్షుడు బృంధావన మల్లిక్, జయపురం శాసన సభ నియోజకవర్గం బీజేడీ నేత ధర్మేంద్ర అధికారి పాల్గొన్నారు.