అమ్మో.. మెమో! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. మెమో!

Oct 6 2025 2:34 AM | Updated on Oct 6 2025 2:34 AM

అమ్మో.. మెమో!

అమ్మో.. మెమో!

జిల్లా వైద్యారోగ్య శాఖలో గ్రూపుల గోల

వరుస మెమోలు జారీ చేస్తున్న ఓ అధికారి

ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులకు 20కి పైగా మెమోలు జారీ

అరసవల్లి : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఇప్పుడు కొత్తగా వర్గపోరు ఎక్కువైంది. మాట్లాడితే మెమో అన్న చందంగా ‘పరిపాలన’ సాగుతోంది. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉన్న రెండు సీట్ల మధ్య అంతర్గత పోరు.. పలు రకాల వివాదాలకు కేంద్రమవుతోంది. ఇక అవినీతి విషయంలో ఏకంగా డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ ఏసీబీకి చిక్కగా.. అక్రమాల్లో కార్యాలయ సూపరింటెండెంట్‌ భాస్కర్‌కుమార్‌ విధుల నుంచి సస్పెండయ్యారు. ఇలా ఈ కార్యాలయంలోని కీలక స్థానాలకు పెద్ద ఎత్తున అవినీతి మరకలంటాయి. రెండు మూడు నెలలుగా సూపరింటెండెంట్‌ భాస్కర్‌కుమార్‌కు, కార్యాలయ పరిపాలనాధికారి బాబూరావు మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇరు కీలక ఉద్యోగులకు సన్నిహితుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌ తర్వాత ఆయన వర్గానికి చెందిన పలువురు ఉద్యోగులకు మెమోల రూపంలో చర్యలు వెంటాడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగానే క్రమశిక్షణ చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు జోరందుకున్నాయి.

రెండు నెలల్లో 20 మెమోలు...!

జిల్లా వైద్యారోగ్య శాఖలో మెమోల జారీ ఎక్కువయ్యింది. ఇటీవల ఏఎన్‌ఎంల (సచివాలయం) బదిలీల్లో బాగా జేబులు నింపుకొన్న ఓ అధికారి అంతా తానై వ్యవహరించడంతో పాటు అడ్డొచ్చినా.. అడ్డు చెప్పినా క్రమశిక్షణ చర్యలే అంటూ వ్యవహారం నడుపుతున్నారనే చర్చ జోరందుకుంది. రెండు మూడు నెలల్లోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సబార్డినేట్‌, టైపిస్టు నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ హోదా వరకు సుమారు 45 మంది వరకు విధుల్లో ఉన్నారు. వీరంతా పరిపాలనా విభాగ సూచనల మేరకు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కొంత కాలంగా సాగుతున్న వర్గ పోరులో భాగంగా సుమారు ఏడుగురు ఉద్యోగులకు చర్యల్లో భాగంగా 20 వరకు మెమోలు జారీ చేశారు. సీనియర్‌ అసిస్టెంట్‌ భవాని ప్రసాద్‌కు మూడు, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రశాంత్‌కుమార్‌కు మూడు, సీనియర్‌ అసిస్టెంట్‌ చంద్రమౌళీశ్వరరావుకు రెండు, టైపిస్టు ఎస్‌.రామచంద్రరావుకు రెండు, టైపిస్టు ఎం.జగదీష్‌కు నాలుగు, సీనియర్‌ అసిస్టెంట్‌ విజయ సుందరీమణి (గీతాంజలి)కి మూడు, జూనియర్‌ అసిస్టెంట్‌ బి.రామచంద్రరావుకు రెండు చొప్పున మెమోలు వరుసగా జారీ చేశారు. వరుసగా మూడు మెమోలు జారీ చేస్తే చార్జి మెమో ఫ్రేమ్‌ చేసే అవకాశాలున్నాయి. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు ఇంక్రిమెంట్లు కూడా కోల్పోయే ప్రమాదముందని బాధిత ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వరుస వ్యవహారాలతో డీఎంహెచ్‌వో కార్యాలయంలో మెమోల గోలపై చర్చ జిల్లా వ్యాప్తమైంది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మెమోలను ఇచ్చారో.. లేక వర్గపోరులో బలిపశువులను చేస్తున్నారో అన్న చర్చ కూడా సాగుతోంది. ఉన్నతాధికారులు జిల్లా కార్యాలయంలో ‘పరిపాలన’పై ప్రత్యేక దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు బహిర్గతమవుతాయని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement