
ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి
శ్రీకాకుళం న్యూకాలనీ:
విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు అధ్యక్షతన కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వేదికగా సమాజంలో సైన్స్ వైబ్రేషన్ పేరిట రెండు రోజుల సైన్స్ ప్రయోగాల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కళాశాల సెంటర్ ఫర్ అప్లయిడ్ సైన్సెస్, జంతుశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఇండిజీనిఎస్ ఫర్ ప్రోగల్ సైన్స్ ఇన్వెన్షన్ సొసైటీ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రశ్నించే తత్వం ఉంటే విషయ పరిజ్ఞానం పెరిగి, అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. అలాగే సైంటిఫిక్ టెంపర్, పరిశోధనా విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు.
కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ మదమంచి ప్రదీప్, ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పోలినాయుడు, ప్రొగ్రాం కో–ఆర్డినేటర్స్ డాక్టర్ రోణంకి హరిత, పి.సుధారాణి, శివాల రవిబాబు, కె.అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి