మోటార్లు తిరగడం లేదు..
కాలిపోతున్నాం..
● వేధిస్తున్న విద్యుత్ సమస్య ● ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు 50 పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ● హెచ్చుతగ్గులతో కాలిపోతున్న మోటార్లు
కవిటి : వ్యవసాయం, రైతుల సంక్షేమమే తమ ధ్యేయమంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనకుదరడం లేదు. ఇప్పటికే యూరియా, ఎరువులు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు కరెంట్ కష్టాలు సైతం వెంటాడుతున్నాయి. ఉద్దాన ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ బోరు బావులపైనే ఆధారపడి సాగు జరుగుతోంది. కవిటి మండలం పుటియాదళ రెవెన్యూ గ్రామాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు పెద్దసమస్యగా మారాయి. ఇక్కడ 276 ఎకరాలు వరిసాగు విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో దమ్ముల సీజన్‌లో మినహాయించి వరినాట్లు వేశాక సరైన వర్షం లేక అన్నదాత బోరుమంటున్నారు. ఇలాంటి సమయంలో అండగా నిలవాల్సిన ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు మొరాయిస్తున్నాయి. మోటార్లు తిరగడం లేదు. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌పై 51 వరకు కనెక్షన్లు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఇటీవల 8 మోటార్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కీలక దశలో..
వరిపైరు పొట్టదశకు చేరుకునే క్రమంలో నీరు తప్పక అందాల్సి ఉంది. ఈ సమయంలో మోటార్లు తిరగక రైతుల ఆందోళన చెందుతున్నారు. దీనికి తక్షణ పరిష్కారంగా మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీని పట్టించుకోకుండా ఇన్ని కనెక్షన్లు ఎందుకు ఇచ్చారంటే ఉద్యోగులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి దృష్టి సారించాలని, లేనిపక్షంలో 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదికి ఒకే పంట పండిస్తున్నాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్‌మోటార్లు మాకు శ్రీరామరక్ష అనే భావనతో ఉండేవాళ్లం. కానీ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పరిమితికి మించి కనెక్షన్లు ఉండటంతో అసాధారణంగా లోడ్ పెరిగింది. మోటార్లు తిరగడం లేదు. తక్షణం విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి రైతుల్ని ఆదుకోవాలి.
– బెందాళం వెంకటేశ్వరరావు,
రైతు, కవిటి
పుటియాదళలో ఎకరా పైగా వరిపొలం ఉంది. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా లేక విద్యుత్ మోటార్లపైనే ఆధారపడుతున్నాం. మా ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో ఈ సీజన్‌లో 8 మోటార్లు కాలిపోయాయి. ఎప్పుడు ఎవరి మోటార్ కాలిపోతోందో అనే భయం వెంటాడుతోంది. తక్షణమే లోడ్‌ను తగ్గించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే చర్యలు తీసుకోవాలి.
– బి.జయరాం,
రైతు, రామయ్యపుట్టుగ
కర్షకులకు కరెంట్ కష్టాలు
కర్షకులకు కరెంట్ కష్టాలు