
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
● అఖిల పక్ష సమావేశంలో ఖరారు
● మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు
● అన్ని పార్టీలు సహకరించాలి: స్పీకర్ సురమా పాఢి
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశ మందిరంలో స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన మంగళవారం అఖిల పక్ష సమావేశం జరిగింది. వర్షాకాలం సమావేశాల్లో సభలో కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడడమే ఈ సమావేశం ప్రాథమిక లక్ష్యం. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్, వామపక్షం కమ్యునిస్టు (మార్కిస్టు) ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మోహన్ మాఝి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్‌దేవ్, ప్రభాతి పరిడాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభలో వర్షాకాల సమావేశాలు సజావుగా నడపడానికి అఖిల పక్ష సభ్యుల సహకారం అనివార్యమని స్పీకర్ అన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతాయి. స్వల్ప కాలిక ఈ సమావేశాలను ఫలప్రదంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమావేశల్లో మొత్తం 7 పని దినాలు ఉంటాయి. వాటిలో ఒక రోజు ప్రైవేటు సభ్యుల బిల్లులు, మరో రోజు నో ఆఫీసు డే ఉంటాయని ఖరారు చేశారు.
నేడు విపక్ష సమావేశం
ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ శాసన సభా పక్ష సమావేశం బుధవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. స్వల్పంగా వారం రోజుల నిడివితో ముగుస్తున్నందున పూర్తి సమయాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉపకరించే దిశలో సద్వినియోగపరచుకోవాలని విపక్షం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా నిలదీసేందుకు కసరత్తు చేస్తోంది.
అవిశ్వాస తీర్మానం యోచన
కాంగ్రెసు పార్టీ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ నుంచి ఈ మేరకు సాయం ఆకాంక్షిస్తోంది. లేకుంటే ఒంటరిగానైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు పట్టుదలగా ఉంది. ప్రతిపక్షాలు అనేక కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరికించడానికి సిద్ధమవుతున్నందున ఈ సమావేశాలు సభలో తుఫాను అలజడి రేపే అవకాశం ఉంది. దీనికి ప్రతిస్పందనగా అధికార భారతీయ జనతా పార్టీ ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధత వ్యక్తం చేస్తోంది.
ట్రాఫిక్ ఆంక్షలు
శాసనసభ వర్షాకాల సమావేశాలు పురస్కరించుకొని నగరంలో వాహనాల రాకపోకలను నియంత్రించాలని కమిషనరేట్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈనెల 18వ తేదీ నుంచి 25 వరకు జరిగే ఈ సమావేశాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర శాసనసభ పరిసరాల్లో వాహనాల రవాణా నియంత్రించడానికి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సిఫార్సు చేశారు. నిషేధిత ప్రాంతాల్లో రద్దీని నివారించడానికి ప్రయాణికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలు పోలీసు, అగ్నిమాపక మరియు అంబులెన్స్ సేవలతో సహా అత్యవసర వాహనాలకు వర్తించవు. అలాగే రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర సచివాలయం మరియు ఇతర పరిపాలనా భవనాలు వంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వచ్చే అఽనుమతి కలిగిన వాహనాలను యథాతదంగా రాకపోకలు చేసేందుకు అనుమతిస్తారు.
వాహనాల రవాణా నిబంధనలు
హౌసింగ్ బోర్డు స్క్వేర్ నుంచి రవీంద్ర మండపం వైపు వచ్చే వాహనాలను కేశరి టాకీస్ స్క్వేర్ వద్ద మళ్లిస్తారు.
ఏజీ స్క్వేర్ నుంచి పీఎంజీ వైపు వచ్చే వాహనాలు జయదేవ్ భవన్ వద్ద కుడి వైపునకు తిరిగి ఇందిరా గాంధీ పార్క్ రోడ్డులో వెళ్లాలి.
మాస్టర్ క్యాంటీన్ వైపు నుంచి పీఎంజీ వైపు వచ్చే అన్ని వాహనాలను దిగువ పీఎంజీ వద్ద పక్కనే ఉన్న వీధి దగ్గర మళ్లిస్తారు.
120 ఈన్‌ఫాంట్రీ బెటాలియన్ స్క్వేర్ నుంచి వచ్చే వాహనాలను రవీంద్ర మండపం వైపు నివారించి పవర్ హౌస్ స్క్వేర్ వైపు మళ్లిస్తారు.
రాజ్ భవన్ స్క్వేర్ నుంచి ఎమ్మెల్యే కాలనీ మరియు రవీంద్ర మండపం వైపు వచ్చే వాహనాలను శాస్త్రి నగర్ స్క్వేర్ వైపు మళ్లిస్తారు.