
భారీగా గంజాయి పట్టివేత
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆపరేషన్ ప్రహార్ నడుస్తున్న నేపథ్యంలో మోహనా పోలీసు అధికారి బసంత్ శెఠి నేతృత్వంలో మంగళవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా శికుళిపదర్ గ్రామం రోడ్డు భగమర్రి వద్ద పది బస్తాల గంజాయి రవాణా చేయడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తుండగా పట్టుబడినట్టు ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి గుడ్డు రయితోగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి సమారు 2.20 క్వింటాళ్లు ఉంది. దీని విలువ మార్కెట్‌లో రూ.20 లక్షలు ఉంటుందని మోహనా ఐఐసీ బసంత్ కుమార్ శెఠి తెలియజేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు.
జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ పోలీసులు ఒక ఆటోలో ఒక క్వింటాల్ 3 కేజీల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రిక మంగళవారం వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ జరుపుతుండగా బొయిపరిగుడ – కొరాపుట్ జంక్షన్ మీదుగా ఒక ఆటో వేగంగా వస్తూ కనిపించింది. ఆటో డ్రైవర్ పోలీసులను చూసి వెంటనే ఆటోని విడిచిపెట్టి అడవిలోకి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటబడినా చీకటిగా ఉండడం వలన సాధ్యం కాలేదు. డ్రైవర్ విడిచిపెట్టిన ఆటోను తనికీ చేయగా అందులో నాలుగు గంజాయి బస్తాలు పట్టుబడ్డాయని పోలీసు అధికారి వెల్లడించారు. ఆటోతో గంజాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆటోలో మొత్తం ఒక క్వింటాల్ 3 కిలోల గంజాయి ఉందని వెల్లడించారు. కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
గుణుపూర్ రైల్వేస్టేషన్‌లో...
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ రైల్వేస్టేషన్‌లో 27 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గజపతి జిల్లా అడవా ప్రాంతానికి చెందిన సుదామ్ నాయక్, ఆర్.ఉదయగిరి ప్రాంతానికి చెందిన నానునా బెవర్త ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గుణుపూర్ రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఒక మహిళ, మరో యువకుడి బ్యాగులు తనిఖీలు చేయగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.95 వేలు ఉంటుందని అంచనా వేశారు.

భారీగా గంజాయి పట్టివేత