
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని గుమ్మలో కొత్తగా నిర్మించిన ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాల ఆరు మాసాలుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. గుమ్మ, నువాగడ, రాయఘడ, ఆర్.ఉదయగిరిలోని రామగిరి, మోహనాలో కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య ఆదర్శ రెసిడెన్సియల్ విద్యాలయాలు నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆర్.ఉదయగిరిలో రాత పరీక్ష నిర్వహించింది. అందులో 60 మంది గుమ్మ ఏకలవ్య పాఠశాలకు ఎంపికై నట్లు జాబితా ప్రచురించారు. అయితే ఇప్పటివరకు పాఠశాలలో తరగతి గదులు పూర్తికానందున విద్యార్థులకు క్లాసులు మొదలు పెట్టలేదు. దీంతో తమ పిల్లలు ఒక విద్యా సంవంత్సరం కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో వద్ద విన్నవించారు. మొత్తం 60 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి వినతిపత్రం అందజేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలు తెరవకపోతే రస్తారోకో చేపడతామని హెచ్చరించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన