
ఉపాధ్యాయుడిని బదిలీ చేయండి
రాయగడ:
సదరు సమితి నకిటి పంచాయతీలోని సొరొముండా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో చదువులు సక్రమంగా కొనసాగడం లేదని, సరిగ్గా ఒక ఉపాధ్యాయుడు విధులకు హాజరవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వివరించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఈ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు మధ్యాహ్న భోజనం సమయంలో మాత్రమే వచ్చి వెళ్లిపోతున్నారన్నారు. అతను ఎప్పుడూ పాఠాల చెప్పడం లేదని పేర్కొన్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అదనపు అధికారి భజన్ లాల్ మాఝి దృష్టికి తీసుకెళ్లగా దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని చెప్పారు.