
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: జిల్లాలో నువాగడ బ్లాక్ తబరాడ గ్రామ పంచాయతీ భవనంలో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు అధిక స్పందన లభించింది. జిల్లా ఎస్పీ జ్యోతింద్రకుమార్ పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి శంకర కెరకెటా హాజరయ్యారు. తబరాడ గ్రామ పంచాయతీతోపాటు కె.జలార్‌సింగి, ఖోజురిపద గ్రామాల నుంచి మొత్తం 92 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 68, గ్రామ సమస్యలకు సంబంధించినవి 24 ఉన్నాయి. ఒక అభియోగాన్ని అధికారులు వెంటనే పరిష్కరించారు. సామాజిక పింఛన్లను ముగ్గురు దివ్యాంగులకు జిల్లా ఎస్పీ పండా అందజేశారు. ఈ సందర్భంగా తబరాడ గ్రామ పంచాయతీ ఆవరణలో మెడికల్ క్యాంప్‌ను సీడీఎంఓ ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్‌కు నువాగడ పంచాయతీ సమితి అధ్యక్షురాలు మాలతి ప్రధాన్, బీడీఓ లోకనాథ శోబోరో, తహసీల్దార్ మోనాలిసా ఆచార్య, సి.డి.ఎం.ఓ ఎం.ఎం.ఆలీ, తదితరులు పాల్గొన్నారు.