
హిందీ భాషాభివృద్ధిపై.. నిలువెల్లా నిర్లక్ష్యం
● టీచర్ల భర్తీ, ఇతర అంశాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం
● రాజభాషకు ప్రోత్సాహం కరువు
● నేడు జాతీయ హిందీ దివాస్
శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ భాష హిందీపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందీ భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలేదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో హిందీతోపాటు లాంగ్వేజ్ టీచర్లను సైతం నియమించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వైఎస్సార్ సీపీ పాలనలో హిందీ భాషాభివృద్ధికి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. హిందీ సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలల్లో ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. గత డీఎస్సీలో హిందీ పోస్టులను సైతం భారీగా భర్తీ చేశారు. ప్రస్తుతం హిందీ భాష పట్ల, హిందీ ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని పలువురు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి రాజ భాషగా హిందీని ప్రోత్సహించాలని హిందీమంచ్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నేటి నుంచి పక్షోత్సవాలు..
ఈ నెల 14న జాతీయ హిందీ దివాస్ సందర్భంగా.. ఆదివారం నుంచి పక్షోత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు. ఆదివారం నుంచి 28వ తేదీ వరకు 15 రోజులపాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఐదు రోజులు పాటు హిందీ దివస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంచ్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోనే శ్రీధర్ నేతృత్వంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. హిందీ ఫోరం, హిందీ వికాస వేదిక ఆధ్వర్యంలో విద్యార్ధులను హిందీపై ఆసక్తిపెంచేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేలా కసరత్తులు చేశారు. మరోపక్క హిందీ సులేఖన్ పోటీలను పోటీలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు.