
టీ షాపులో అగ్ని ప్రమాదం
పర్లాకిమిడి: స్థానిక గాంధీ జంక్షన్ వద్ద ఒక టీ షాపులో అగ్ని ప్రమాదం జరిగి సుమారు రూ.5 లక్షల విలువ కలిగిన సామగ్రి కాలి బూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం గాంధీ జంక్షన్ వద్ద సాహు టీ దుకాణంలో కొత్త రిఫ్రిజరేటర్‌కు కనెక్షన్ ఇచ్చాడు. అయితే శనివారం వేకువజామున దుకాణం నుంచి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. కానీ అప్పటికే షాపులో ఉన్న వస్తువులు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
షాలిని పండిట్ బదిలీ
భువనేశ్వర్: ఒడిశా క్యాడర్ 2001 సంవత్సరపు ఐఏఎస్ అధికారి షాలిని పండిట్ కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక సేవల శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ పరిధిలోని క్యాబినెట్ నియామక కమిటీ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమె 5 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులు పేర్కొన్నాయి. బాధ్యతలు స్వీకరించిన నుంచి పదవీ కాలం పరిగణిస్తారు. షాలిని పండిట్ ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వ పాఠశాలలు మరియు సామూహిక విద్య విభాగం కమిషనర్ కమ్ సెక్రటరీగా పని చేస్తున్నారు.