
ఆన్‌లైన్ సేవలు ప్రారంభం
భువనేశ్వర్: అవిభజిత ఆగ్నేయ రైల్వే సిబ్బంది సహకార సంస్థ (అర్బన్ బ్యాంక్) ఆన్‌లైన్ సేవలను శనివారం ప్రారంభించారు. నాగపూర్‌లో శనివారం జరిగిన రైల్వే అర్బన్ బ్యాంకు 96వ వార్షికోత్సవంలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ సదుపాయంతో ఖాతాదారులు ఉన్న చోట నుంచి హాలిడే హోం బుకింగ్, రుణ దరఖాస్తు దాఖలు, పొదుపు ఖాతా తాజా వివరాలు, కేవైసీ నమోదు తదితర అర్బన్ బ్యాంకు సంబంధిత సేవలను పొందగలుగుతారని ఖుర్దారోడ్ మండలం ప్రతినిధి లక్ష్మీధర మహంతి తెలిపారు. కార్యక్రమానికి నాగపూర్ మండల రైల్వే అధికారి (డీఆర్‌ఎం) దీపక్ కుమార్ గుప్తా, తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు తదితరులు హాజరయ్యారు.