
పూరీలో త్వరలో క్యూలైన్ దర్శనం
● పార్లమెంటులో రథ చక్రాల ప్రదర్శన
● 14 ఉప సంఘాలు ఏర్పాటు
● శ్రీ మందిరం పాలక మండలి తొలి సమావేశంలో పలు నిర్ణయాలు
సమావేశమైన శ్రీ మందిరం కొత్త పాలక మండలి
భువనేశ్వర్: కొత్తగా ఏర్పడిన పూరీ శ్రీ మందిర్ కమిటీ పాలక మండలి తొలి సమావేశం బుధవారం జరిగింది. పూరీలోని నీలాద్రి భక్త నివాస్ సమావేశం హాలులో గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీర్మానాల్ని ఆమోదించినట్లు ప్రకటించారు. భారత పార్లమెంట్ భవనం ఆవరణలో జగన్నాథ రథ చక్రాల ప్రదర్శనకు పాలక మండలి ఆమోదం తెలిపింది.
ఉప కమిటీల ఏర్పాటు, భక్తుల కోసం క్యూ వ్యవస్థను అమలు చేయడం, రత్న భాండాగారంలో విలువైన ఆభరణాలు, నగలు, పాత్రలు తదితర అమూల్య సంపద నిర్వహణ, ధృవీకరణ వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఆలయ పాలన, భద్రత, ఆచారాలు సజావుగా సాగడానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన విషయాలను చర్చించారు.
వరుస దర్శనం..
శ్రీమందిరం రత్నవేదికపై కొలువుదీరిన చతుర్థామూర్తుల్ని భక్తుల్ని దర్శించుకునేందుకు వరుస దర్శనం(క్యూలైన్) వ్యవస్థ ప్రతిపాదనకు కొత్త పాలక మండలి ఆమోదించింది. శ్రీ మందిరం లోపల నాట్య మండపం ప్రాంగణంలో దీని కోసం ప్రత్యేక వ్యవస్థ ప్రవేశ పెడతారు. తొలి దశలో లాంఛనంగా ఈ విధానం ప్రవేశ పెట్టాలని తీర్మానించారు. కలెక్టర్, ఎస్పీ, ఒడిశా వంతెనల నిర్మాణం సంస్థ, భారత పురావస్తు శాఖ నుంచి సమగ్రంగా ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం వరుస దర్శన విషయాన్ని సమీక్షిస్తుంది. శ్రీ మందిర్ అభివృద్ధికి, భక్తులకు సజావుగా దర్శనం కల్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆలయ పాలక మండలి సభ్యుడు సిద్ధేశ్వర్ మహాపాత్రో ఆశాభావం వ్యక్తం చేశారు.
● ఆలయంలోని వివిధ పనుల కోసం 14 ఉపకమిటీలను ఏర్పాటు చేశారు. వాటిలో కలెక్టర్ అధ్యక్షతన సంస్థాగత, జగన్నాథ్ తత్వ పరిశోధన, ప్రచురణ ఉప సంఘం, జగన్నాథ ఆలయ పెన్షన్ ట్రస్ట్ బోర్డు ఉప సంఘాలు, ఆలయంలో కళాత్మక శిల్పాల పరిశీలన కోసం సాంస్కృతిక ప్రాజెక్ట్ ఉప సంఘం, భూమి, ఆర్థిక, సేవలు, రత్న భాండాగారం, అప్పీల్ ఉప కమిటీలు ప్రధానమైనవిగా పేర్కొన్నారు. గిరీష్ చంద్ర ముర్ము చైర్మన్ అధ్యక్షతన ఆలయ రక్షణ కోసం తొలిసారిగా ఏర్పాటు చేసిన కొత్త ఉపసంఘంలో స్థానిక జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, సేవాయత్‌లు సభ్యులుగా ఉంటారు. దివ్యాంగుల సౌలభ్యానికి ఉత్తర ద్వారం వద్ద ర్యాంప్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి డాక్టరు అరవింద కుమార్ పాఽఢి, పూరీ జిల్లా కలెక్టర్ దివ్య జ్యోతి పరిడా, పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్‌తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.