
కార్యకర్తల అభిప్రాయాలకే పెద్దపీట
● ఏఐసీసీ పరిశీలకుడు కుసుం కుమార్
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు జెట్టి కుసుం కుమార్ (హైదరాబాద్) ప్రకటించారు. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం, కొసాగుమ్డ, పపడాహండి సమితి కేంద్రాలలో పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి మాట్లాడారు. కిందిస్థాయి నుంచి ప్రతి కార్యకర్త అభిప్రాయం పరిగణనలోనికి తీసుకోవడానికే రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేలు తనను పంపించారన్నారు. పార్టీ అధిష్టానం కిందిస్థాయి కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుందన్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల వద్దకే వెళ్లి సమితి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు పదవుల ఎంపిక చేస్తున్నామన్నారు. కార్యకర్తలు ఎటువైపు మెగ్గు చూపితే వారే అధ్యక్షులు అవుతారన్నారు. ఇందులో ఎటువంటి లాభీలు గానీ, సిఫార్స్‌లు గాని చెల్లవన్నారు.అధ్యక్షులు అయ్యే వారి గత చరిత్ర కూడా పరిగణలోనికి తీసుకుంటున్నామన్నారు. కొత్త అధ్యక్షులు రానున్న మూడంచెల పంచాయతీ ఎన్నికలు, తర్వాత పురపాలక ఎన్నికలో సత్తా చూపాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనే సత్తా ఉన్నవారికే అధిక ప్రాధాన్యం ఇస్తామని కుసుం కుమార్ ప్రకటించారు. మూడు సభలలో కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. వారితో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. తనదైన శైలిలో పార్టీలో గతంలో జరిగిన సంఘటనలు వెలికి తీశారు. ఈ సమావేశాల్లో మాజీ ఎంఎల్‌ఏ భుజబల్ మజ్జి, నాయకులు క్రుష్ట కులదీప్, గెంబలి సాయిరాజ్ పాల్గొన్నారు.

కార్యకర్తల అభిప్రాయాలకే పెద్దపీట