
ఒకే కుటుంబంలో ఆరుగురికి యావజ్జీవ శిక్ష
కొరాపుట్: ఒకే కుటుంబంలో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర కోర్టుల సముదాయంలో అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి బిష్టు ప్రసాద్ మిశ్రా ఈ తీర్పును వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోష్ మిశ్రా విలేకరులకు వివరాలు వెల్లడించారు. నబరంగ్‌పూర్ జిల్లా కొడింగా పోలీస్‌స్టేషన్ పరిధిలో బరమసి గ్రామంలో 2022 ఆగస్ట్ 9న పొలం పని చేసుకుంటున్న డొంబురు పూజారి (40) కుటుంబంపై అదే గ్రామానికి చెందిన అనంత పూజారి కుటుంబ సభ్యులు ఆయుధాలతో వచ్చి దాడికి పాల్పడ్డారు. పదలం పూజారి అనే వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపడానికి ప్రయత్నించారు. మహిళలు, పిల్లలపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడ్డ డొంబురును నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కటక్‌లో ఎస్‌బీసీ మెడికల్ కాలేజికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డొంబురు మృతి చెందాడు. మిగిలిన బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఈ ఘటనకు కారకులైన అనంత పూజారి, శివశంకర్ పూజారి, చందన్ పూజారి, డుమర్ పూజారి, దాలింబు పూజారి, మైనర్ బాలుడికి యావజ్జీవ శిక్ష విధించారు.