
440 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు ఖోయిర్‌పూట్ సమితి సుననగార్ గ్రామ అడవిలో ముందస్తు సమాచారంతో దాడులు చేపట్టి 440 కిలోల గంజాయిని మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో పోలీసులకు గంజాయి అక్రమ రవాణపై అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ సమాచారం వచ్చింది. దీంతో బలిమెల ఐఐసీ దీరాజ్ పట్నాయక్ ఎస్‌ఐ అజిత్‌తో పాటు ఓ బృందం సుననగార్ గ్రామానికి చేరుకున్నారు. సమాచారం ప్రకారం పోలీసులు గాలించగా ఓ చోట 18 సంచుల్లో గంజాయి దొరికింది. పోలీసుల రాకను గమణించిన మాఫీయా అక్కడ నుంచి పరారైంది. పట్టుబడ్డ గంజాయిని బలిమెల పోలీసుస్టేషన్‌కు తరలించారు. బుధవారం తూకం వేయగా 440 కిలోలు ఉందని.. దీని విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని ఐఐసి దీరాజ్ పట్నాయక్ చెప్పారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు.