
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
టెక్కలి రూరల్: సంత బొమ్మాళి మండలం వడ్డివాడ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మురపాల రెయ్యమ్మ(45) అనే మహిళ మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగి రామారావు, మురపాల రెయ్యమ్మలు కలసి ద్విచక్ర వాహనంపై బోరుభద్ర నుంచి సంతబొమ్మాళి వైపు వెళ్తుండగా అదే సమయంలో ముందు వెలుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెయ్యమ్మ, రామారావులతో పాటు మరో బైకుపై ఉన్న నెయ్యల రామకృష్ణకు సైతం గాయాలయ్యాయి. ముగ్గురినీ కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెయ్యమ్మ మృతిచెందింది. సంతబొమ్మాళి ఎస్‌ఐ సింహాచలం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి నేరస్తులపై నిఘా
శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన, పెండింగ్‌లో ఉన్న గంజాయి కేసుల దర్యాప్తు వేగవంతం చే యాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డివిజన్లు, సర్కిళ్లు, స్టేషన్ల వారీగా అధికారులతో సమీక్షించారు. గంజాయి కేసుల దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ అమలు, పెండింగ్ కారణాలపై ఆరా తీశారు. ఎస్పీతోపాటు డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ గోవిందరావు పాల్గొన్నారు.
హోంగార్డు కుమారుడికి అభినందనలు..
పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో హోంగార్డు చక్క వాసుదేవరావు కుమారుడు శశిధర్‌నాయుడు నీట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటు పొందడంతో ఎస్పీ అభినందించారు.
అధికార లాంఛనాలతో ఏఎస్‌ఐ అంత్యక్రియలు
నరసన్నపేట: అనారోగ్యంతో మృతి చెందిన పోలాకి ఏఎస్‌ఐ పి.ఆదినారాయణకు మంగళవారం నరసన్నపేటలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలాకి ఎస్‌ఐ రంజిత్ తెలిపారు. నరసన్నపేట, పోలాకి పోలీసుస్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం తిలారు–కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు పైబడి ఉంటుందని, చేతిపై శ్రీను అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. రైలు నుంచి జారి పడి మృతిచెందాడా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు పేర్కొన్నారు.
అండర్–23 క్రికెట్ జట్టులో హరీష్
హిరమండలం: అండర్–23 విభాగంలో ఓ సంస్థ నిర్వహించే టీ–20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియాలో గొట్టా గ్రామానికి చెందిన బత్తుల హరీష్ చోటు సంపాదించాడు. నేపాల్‌లో డిసెంబర్ నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో హరీష్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో హరీష్‌ను గ్రామపెద్దలతో పాటు గ్రామస్తులు అభినందించారు.
గొంతు కోసుకొని
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పలాస: పలాస కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన కోరాడ గవరయ్య (35) మంగళవారం ఉదయం పదునైన చాకుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
లక్ష్మమ్మకు సత్కారం
వజ్రపుకొత్తూరు: సుమారు 50 ఏళ్లగా ఎంతోమందికి పురుడు పోసిన అంబటి లక్ష్మమ్మ సేవలు వెలకట్టలేనివని విశ్రాంత ఆర్మీ అధికారి కొయిరి ప్రసాదరావు అన్నారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటలోని చిన్న వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మమ్మ సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. వైద్యం అందుబాటులో లేని సమయంలో ఉద్దాన, తీర ప్రాంత గ్రామాల్లో ప్రసవ వేదనలో ఉన్న ఎంతో మంది గర్భిణులకు అండగా నిలిచి ప్రతికూల పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారని కొనియాడారు. గ్రామపెద్దలు గాత ముకుందరావు, కె.కొర్లయ్య, కాంతారావు, దాలయ్య, సాధు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం