
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
బొండపల్లి: మండలం కేంద్రంలో జాతీయ రహదారి 26పై మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి పెద్దప్రమాదం జరగక పోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
వట్టిగెడ్డలో గల్లంతైన రైతు మృతి
సాలూరు రూరల్: మండలంలోని దుద్ది సాగరం గ్రామానికి చెందిన మంచాల రామయ్య (45) వట్టిగెడ్డలో సోమవారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో గాలించగా గ్రామ సమీపంలోని తుప్పల్లో మృతదేహం దొరికిందని రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
గెడ్డలో పడి వ్యక్తి మృతి
పాలకొండ: నగరపంచాయతీ పరిధిలోని కొండవీధికి చెందిన కారంగి రమేష్(42) గెడ్డలో పడి మృతిచెందాడు. మండలంలోని గోపాలపురం గ్రామ సమీపంలోని గెడ్డలో చేపల వేటకు వెళ్లిన రమేష్ ప్రమావశాత్తు కాలు జారి నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. సోమవారం రాత్రి సయమంలో ప్రమాదం జరగడంతో గమనించిన సహచరులు బయటకు తీసి మరణించినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ప్రయోగమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
లాటరీ విధానంలో బార్ కేటాయింపు
పార్వతీపురం రూరల్: లాటరీ విధానంలో సాలూరులోని ఒక బార్‌ను కేటాయించారు. నాలుగు దరఖాస్తులు రావడంతో బార్ కేటాయింపునకు కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సమక్షంలో మంగళవారం లాటరీ తీశారు. బార్‌ను సాలూరుకు చెందిన రుంకాన నరేష్ దక్కించుకున్నట్టు ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాథుడు తెలిపారు.
సమాచార శాఖ ఎ.డిగా గోవిందరాజులు
విజయనగరం అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకుడిగా పి.గోవిందరాజులు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా డీపీఆర్‌ఓగా, డివిజనల్ పీఆర్‌ఓగా, ఇన్‌చార్జ్ డీపీఆర్‌ఓగా కూడా పనిచేస్తున్నారు. తాజాగా ఇక్కడికి పదోన్నతిపై రానున్నారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

పుష్పాలంకరణలో పైడితల్లి

పుష్పాలంకరణలో పైడితల్లి

పుష్పాలంకరణలో పైడితల్లి