రాయగడ: పాత కక్షలతో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో దాడి చేసిన ఘటన స్థానిక రెల్లివీధి కూడలి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఈ దాడిలో రెల్లివీధికి చెందిన రాజాన జేమ్స్ (53 ) అనే వ్యక్తి తీవ్రగాయాలకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న బాధితుడి కుటుంబీకులు రక్తపు మడుగులో పడి ఉన్న జేమ్స్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో డైలీ మార్కెట్ నుంచి బైకుపై ఇంటికి వస్తున్న సమయంలో రెల్లివీధి కూడలి వద్ద అప్పటికే కాపుకాసి ఉన్న ముగ్గురు దుండగులు అతని బైకు ఆపి తగాదా పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పథకం ప్రకారం ముందుగానే తీసుకొచ్చిన పదునైన కత్తి, గొడ్డలితో దాడి చేశారు. దీంతో రెండు కాళ్లుకు తీవ్రగాయాలవ్వడంతో పాటు కడుపులో కత్తితో పొడిచి దుండగులు పారిపోయారు. స్థానిక హాస్పిటల్‌లో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బాధితుడిని విజయనగరం తరలించినట్లు సమాచారం.
విరిగిపడిన కొండ చరియలు
కొరాపుట్: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. మంగళవారం కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి తెంతులి పొదర్ గ్రామ పంచాయతీ కుకడా సీల్ గ్రామ వద్ద రాళ్లు జారీ రోడ్డు మీదకి దొర్లుతూ వచ్చాయి. ఈ మార్గంలో తుల రంగ పానీ, ఉప్పర్ రంగ పానీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో) పరిధిలోని గనుల గ్రామాలు కావడంతో ప్రభావం చూపించింది.
ఏనుగుల గుంపు సంచారం
కొరాపుట్: నవరంగ్‌పూర్‌లో జిల్లాలోకి అటవీ ఏనుగుల గుంపు ప్రవేశించింది. మంగళవారం ఉమ్మర్‌కోట్ సమితి కొహరా, కుర్సి గ్రామ పంచాయతీల్లోని మొక్కజొన్న పంటల్లో ఏనుగులు సంచరించడం గిరిజనులు గమనించారు. సమీప చత్తీస్‌ఘఢ్ రాష్ట్రం నుంచి ఇవి తరలివచ్చాయి. వాటిలో నాలుగు ఏనుగులను గిరిజనులు గుర్తించారు. ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంట విస్తారంగా పండింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వ్యక్తిపై మారణాయుధాలతో దాడి
వ్యక్తిపై మారణాయుధాలతో దాడి
వ్యక్తిపై మారణాయుధాలతో దాడి