● ఏఐసీసీ పరిశీలకుడు జెట్టి కుసుంకుమార్
కొరాపుట్: దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని ఏఐసీసీ పరిశీలకుడు జెట్టి కుసుం కుమార్ జోస్యం చెప్పారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం చేసే కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒడిశాలో డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. సమితి స్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 10 సమితులు, రెండు పురపాలక సంఘాల్లో సమీక్ష సమావేశాలు జరుపుతామన్నారు. అధ్యక్ష పదవి కోసం అందరికీ దరఖాస్తులు ఇస్తామని వెల్లడించారు. నెలాఖరులోపు డీసీసీ అధ్యక్ష ఫలితాలు వెల్లడవుతాయన్నారు. అనంతరం సమితి అధ్యక్ష, మిగతా కార్యవర్గాలను నియమించనున్నట్లు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ముందుంటుంది
దేశ ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని కుసుం కుమార్ అన్నారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. ప్రస్తుతం ఓట్ చోరీపై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్రతో ప్రజలు వాస్తవాలు గ్రహించారన్నారు. నాడు కొరాపుట్, నబరంగ్‌పూర్ పార్లమెంటరీ స్థానాలు కాంగ్రెస్‌కి కంచుకోటలని గుర్తు చేశారు. మరలా నబరంగ్‌పూర్‌లో పార్టీ పటిష్టతకి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భుజబల్ మజ్జి, సదానా నాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, కాంగ్రెస్ నాయకులు జి.సాయిరాజు, నాగరత్నం, శివరామరాజు, దిలిప్ బెహరా, కెమరాజ్ బాగ్ తదితరులు పాల్గొన్నారు.