
శ్రమ కోడ్‌ను రద్దు చేయాలి
ఏఐయూటీయూసీ డిమాండ్
జయపురం:కార్మికులపై కేంద్ర ప్రభుత్వం విధించినచిన శ్రమ కోడ్‌ను రద్దు చేయాలని ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ (ఏఐయూటీయూసీ)డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఏఐయూటీయూసీ కొరాపుట్ జిల్లా శాఖ జయపురం సబ్‌డివిజన్ బొయొపరిగులో స్థానిక సమస్యలపై ఆందోళన నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ బిశాయి నేతృత్వంలో కార్యకర్తలు ప్లకార్డులు చేత బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిశాయి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించిన 25 డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని బొయిపరిగుడ సమితి బీడీవోకు సమర్పించారు. కార్మికుల ప్రయోజనాలను హక్కులను కాలరాసేలా ఉన్న శ్రమ కోడ్‌ను వెంటనే రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు ప్రకటించాలని, నిత్యావసర, అత్యవసర సరుకుల ధరలు నియంత్రించాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలని, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలని, లేదా వారికి పెన్షన్ చెల్లించాలని కోరారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ బిశాయి ప్రసంగిస్తూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వ, రాష్ట్రంలో మోహణ మఝి ప్రభుత్వాలు కార్మిక, రైతు, ప్రజల ప్రయోజనాలను కాల రాస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండటంతో దేశంలో నిరుద్యోగులు పెరుగుతున్నారని దుయ్యబట్టారు. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను అంటుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. ధరలను నియంత్రించటంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలం కావటంతో ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోతున్నారన్నారు. దేశంలో పేదరికం పెరుగుతుండగా ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారన్నారు. అందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ విదానాలేనని నిందించారు.అందుచేత శ్రామికులు, రైతులు, ప్రజలు తమ హక్కుల సాధనకు పోరాటమే సరైన మార్గం అన్నారు.