
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సోమవారం 4 రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి న్యూ ఢిల్లీలో జరగనున్న ద్రవ్య, సేవా పన్ను (జీఎస్‌టీ) మండలి 56వ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 3, 4వ తేదీల్లో వరుసగా 2 రోజులపాటు ఈ సమావేశం కొనసాగుతుంది. ఢిల్లీ ప్రయాణానికి ముందుగా జీఎస్‌టీ మండలి సమావేశంలో చర్చనీయాంశ అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్రం పలు కీలక ప్రతిపాదనల్ని ప్రవేశ పెట్టే యోచనతో అడుగులు వేస్తుంది.
ద్రవ్య, సేవా పన్ను కుదింపు
ద్రవ్య, సేవా పన్ను వ్యవస్థలో కొనసాగుతున్న 4 స్థాయిల పన్ను వడ్డన వ్యవస్థని సంస్కరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించనున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ద్రవ్య సేవా పన్ను 4 స్థాయిల నుంచి 2 స్థాయిలకు పరిమితం చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ద్రవ్య, సేవా పన్ను రేటు వ్యవస్థ కొనసాగుతుంది. దీన్ని 2 స్థాయిల విధానానికి మార్చడంతో ద్రవ్య, సేవా పన్ను వ్యవస్థ సరళీకృతం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రతిపాదించనున్నారు. ఈ లెక్కన నిత్య అవసర ద్రవ్యాలు, సేవలకు 5 శాతం పన్ను, అత్యవసర ద్రవ్య, సేవలకు 18 శాతం పన్ను వ్యవస్థని ప్రతిపాదించనున్నారు. విలాసవంతమైన కార్లు, పొగాకు తదితర వర్గీయ ద్రవ్యాలు, సేవలకు 40 శాతం పన్ను ప్రవేశ పెట్టాలని మండలి సమావేశంలో చర్చనీయాంశంగా ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు న్యూ ఢిల్లీ యశోభూమిలో జరిగే సెమికాన్ ఇండియా 2025 కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది.
రాష్ట్ర సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలకు కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులతో ముఖ్యమంత్రి సమావేశాలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో సంస్థాగత ఏర్పాటుతో సహా వివిధ విషయాలను చర్చించనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులు మరియు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవులను భర్తీ చేయడం గురించి కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపితే, రాష్ట్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ, విస్తరణపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 6 మంత్రి పదవులు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్ పదవులు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.